Outbreak of Covid-19 in China: చైనాలో కోవిడ్ ఉద్ధృతి తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా అక్కడ 30 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా దేశంలో గురువారం 34,980 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30,702 మందికి లక్షణాలు లేవని అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు రోజు బుధవారం 36,061 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ విజృంభన ప్రారంభం అయిన తర్వాత చైనాలో ఇప్పటి వరకు 5,233 మంది మరణించారు. డిసెంబర్ 1నాటికి చైనా మెయిన్ ల్యాండ్ లో 3,27,964 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాజధాని బీజీంగ్ తో పాటు షాంఘై, గాంగ్జౌ నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.
Read Also: Koyyur Encounter: మావోయిస్టు చరిత్రలో నెత్తుటి జ్ఞాపకం.. కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 23 ఏళ్లు
ఇదిలా ఉంటే చైనా వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ వల్ల ప్రజలు విసిగిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. జిన్ పింగ్ దిగిపో అంటూ నినాదాలు చేస్తూ..కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కరోనా విషయంలో చైనా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తుండటం అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ఇటీవల జరిగిన ఉరుమ్‌కి అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. వారంతా కోవిడ్ లాక్డౌన్ లో ఉండటంతో చనిపోయారని ప్రజలు ఆరోపించి పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు.
ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసన కారణంగా చైనా ప్రభుత్వం దిగివచ్చింది. కొన్ని నగరాల్లో లాక్డౌన్ సడలింపులను ఇచ్చింది. బీజింగ్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో షాపులు తెరుచుకున్నాయి. చాలా చోట్ల కోవిడ్ టెస్టింగ్ బూత్‌లు పనిచేయడం నిలిచిపోయాయి. గ్వాంగ్‌జౌ నగరంలో కొన్ని రోజుల క్రితం పోలీసులు, ప్రజలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రస్తుతం అక్కడ కూడా సడలింపులను ఇచ్చారు. చాంగ్‌కింగ్, షిజియాజువాంగ్, చెంగ్డు నగరాల్లో కూడా కోవిడ్ కఠిన నిబంధనలను సడలించారు. మాస్ కోవిడ్ టెస్టులను నిలిపేశారు.