Israel-Hamas War: ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో బాంబు దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో పీఎం నెతన్యాహు గానీ.. ఆయన కుటుంబ సభ్యులు గానీ లేరని.. అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. ఇక, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ట్విటర్‌లో ఈ సంఘటనను ఖండించారు.. త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బెంజమిన్ నెతన్యాహుపై రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. అలాగే, ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ కూడా మాట్లాడుతూ.. ప్రధాని ఇంటిపై ఫ్లాష్ బాంబ్ విసరడం వల్ల రెడ్ లైన్ క్రాస్ చేసినట్లైంది.. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని చెప్పుకొచ్చారు.
Read Also: Koti Deepotsavam 2024 Day 8 : సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం
ఇక, శనివారం నాడు గాజా నగరంలోని షాతీ శరణార్థి శిబిరంలోని పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 10 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ శరణార్థి శిబిరంలో ప్రజలు చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం నిర్వాసిత కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు డాక్టర్లు తెలియజేశారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే అబు అస్సీ పాఠశాలలో ఇప్పటికీ శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉండవచ్చని.. ప్రస్తుతం అక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు.