కరోనా పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చే దేశం చైనా. చైనాలోనే మొదట కేసులు బయటపడ్డాయి. అయితే, చైనా వాస్తవాలను దాచిపెట్టడంతో ప్రపంచం ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సార్స్ కొవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్‌తో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచంలో కేసులు పెరుగుతున్నా చైనాలో కేసులు పెద్దగా లేవని, ఒకటి రెండు కేసులు వస్తున్నా వాటిని కఠినమైన లాక్‌డౌన్ వంటివి అమలు చేసి కట్టడి చేస్తున్నామని చైనా చెబుతూ వస్తున్నది. అక్కడి మీడియా కూడా ఆ దేశానికి వంత పాడుతున్నది. అయితే, వాస్తవ పరిస్థితులను ఎవరూ బహిర్గతం చేయలేకపోతున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియడం లేదు. ఇక ఇదిలా ఉంటే, జర్మన్ కార్ల కంపెనీ వొక్స్ వ్యాగన్ చైనాలోని టియాన్‌జిన్ నగరంలో మ్యాన్‌ఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే కార్లను తయారు చేస్తున్నది. అదే నగరంలో కార్ల విడిభాగాల తయారీ కంపెనీనీ కూడా ఏర్పాటు చేసుకుంది.
Read: ఆప్ కీలక నిర్ణయం: ప్రజల చేతుల్లోనే సీఎం అభ్యర్థి ఎంపిక…
అయితే, గత కొన్ని రోజులుగా రెండు యూనిట్లలోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడినట్టు కంపెనీ వర్గాలు తెలియజేశారు. పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ఒమిక్రాన్ బారిన పడటంతో రెండు యూనిట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. నగరంలో పరిస్థితి ఆశాజనకంగా లేదని, ఒమిక్రాన్ తాకిడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. చైనాలోని వాస్తవ పరిస్థితులకు ఇది అద్దం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క టియాన్‌జింగ్ నగరంలోనే కాకుండా అనేక నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితులు ఉన్నాయని సమాచారం. దీంతో ఫిబ్రవరి 4 నుంచి బీజింగ్‌లో నిర్వహించతలపెట్టిన వింటర్ ఒలింపక్స్ సజావుగా జరిగే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.