Nobel Prize In Physics Awarded to Alain Aspect John F Clauser Anton Zeilinger: భౌతికశాస్త్రంలో విశేష కృషి అందించినందుకు గాను.. అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్‌లకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం అయిన నోబెల్ బహుమతి (2022) దక్కింది. ఈ అవార్డును స్టాక్‌హోంలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలోని అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు అద్భుత ప్రయోగాలు చేశారు. అందుకే.. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వారిని ఎంపిక చేశారు. విశేషం ఏమిటంటే.. గతేడాది కూడా భౌతికశాస్త్రంలో ఈ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు పంచుకున్నారు. సుకురో మనాబే, క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీ అనే ముగ్గురు సైంటిస్టులు.. ఈ నోబెల్ బహుమతిని సంయుక్తంగా అందుకున్నారు. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను.. వారిని నోబెల్ వరించింది.
కాగా.. వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు గాను స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే! మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను.. ఆయన్ను ఈ అత్యున్నత బహుమతి వరించింది. ఈ పురస్కారాన్ని సోమవారం స్వీడన్ స్టాక్‌హోంలోని కారోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ బృందం ప్రకటించింది. కాగా.. వారం రోజుల పాటు కొనసాగనున్న నోబెల్ పురస్కారాల ప్రధానంలో భాగంగా.. సోమవారం వైద్యశాస్త్రం, మంగళవారం భౌతికశాస్త్రాలలో అవార్డుల్ని ప్రకటించారు. ఇక బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి పురస్కారం, అక్టోబర్ 10న అర్థశాస్త్రంలో నోబెల్ విజేతల పేర్లను ప్రకటిస్తారు. నోబెల్ పురస్కారాలు అందుకున్న వారికి.. 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదును డిసెంబర్ 10న అందజేస్తారు.