Nicolas Maduro: అమెరికా, లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాపై ఈ రోజు తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. డ్రగ్స్ రవాణా, అక్రమ వలసలకు ఆ దేశం కారణమవుతుందని ట్రంప్ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, యూఎస్ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించామని, దేశం నుంచి బయటకు తీసుకెళ్లినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం సంచలనంగా మారింది. మదురోను చట్టం ముందు నిలబెడుతామని అమెరికా చెబుతోంది.
ఇదిలా ఉంటే, మదురో అరెస్ట్ తర్వాత గతంలో లిబియా నియంత మహ్మద్ గడాఫీ, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఘటనలు గుర్తుకు వస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా అమెరికా దాడుల తర్వాతే శిక్షలతో మరణించారు. ఇప్పుడు మదురో కూడా ఇదే గతి పడుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
సద్దాం హుస్సేన్‌పై ఆరోపణలు:
2003లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సైన్యం ‘‘ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్’’ పేరుతో ఇరాక్‌పై దాడులు చేసింది. సద్దాం ప్రభుత్వం ఇరాక్‌లో ప్రాణాంతక ఆయుధాలను తయారు చేస్తోందని అమెరికా ఆరోపించింది. దీంతో పాటు ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయని యూఎస్ ఆరోపించింది. సొంత ప్రజలపైనే భారీ మానవ హక్కుల ఉల్లంఘటనకు పాల్పడుతున్నాడని చెప్పింది. అణు, జీవ, రసాయన ఆయుధాలు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సద్దాం హుస్సేన్ ప్రభుత్వం తయారు చేస్తుందని యూఎస్ ప్రధాన ఆరోపణ. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఇరాక్‌పై దాడులకు ఆమోదం తెలిపింది.
దాడుల తర్వాత సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత సద్దాం హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ తర్వాత ఉరిశిక్ష విధించారు. అయితే.. రసాయన ఆయుధాలు, జీవ ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పటికీ నిరూపితం కాలేదు. 2006లో సద్దాం హుస్సేన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. ఇరాక్ చట్టాల ప్రకారం, శిక్ష విధించారు. ముక్యంగా 1982లో డుజైల్ గ్రామంలో షియాల ఊచకోతకు బాధ్యుడిని చేస్తూ శిక్ష విధించారు.
మహ్మద్ గడాఫీ:
మువామ్మర్ గడాఫీ లిబియా నియంత శిక్షకు కూడా పరోక్షంగా అమెరికానే కారణం. 40 ఏళ్లు నిర్విరామంగా పాలించిన గడాఫీ చివరకు ఒక కలుగులో పట్టుబడ్డాడు. తన పాలనను వ్యతిరేకించిన వారిని అణిచివేయడం, ఉరిశిక్షలతో పగ తీర్చుకునే వాడు. ఇదే కాకుండా తన పాలనలో చాలా మంది ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 1988లో స్కాట్లాండ్‌లోని లాకర్బీ ప్రాంతంలో పాన్ ఆమ్ ఫ్లైట్‌లో పేలుడు జరిగింది. దీంట్లో 200కు పైగా మంది మరణించారు. 2003లో ఈ బాంబు పేలుడుకు కారణమని గడాఫీ అంగీకరించాడు. ఈ దాడులతో ప్రపంచం ఇతడిని ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా భావించారు.
దీనికి తోడు 2011లో అరబ్ స్ప్రింగ్స్ ఉద్యమంలో లిబియాకు వ్యాపించింది. దీని తర్వాత గడాఫీ ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని భావించాడు. అయితే, అక్కడి గడాఫీ వ్యతిరేక తిరుగుబాటు దళాలకు నాటో దళాలు సహకరించాయి. అక్టోబర్ 2011లో తిరుగుబాటు దళాలకు గడాఫీ చిక్కాడు. ఆ తర్వాత హతమార్చారు.