Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై దాడిని ముమ్మరం చేసింది. లెబనాన్ వ్యాప్తంగా దాడులు చేస్తోంది. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని వైమానిక దాడిలో హతమార్చింది. అంతకుముందు హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్లను హతం చేసింది. వీరిలో అత్యంత కీలకమైన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, అలీ కర్కీ వంటి వారు ఉన్నారు. అయితే, నస్రల్లాకి బహిరంగ అంత్యక్రియలు నిర్వహించే వరకు అతడిని రహస్య ప్రదేశంలో తాత్కాలికంగా ఖననం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? వంటింట్లో దొరికే ఇది వాడండి
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బహిరంగంగా అంత్యక్రియలకు అనకూలంగా మారే వరకు నస్రల్లాను తాత్కాలికంగా ఖననం చేసినట్లు తెలుస్తోంది. నస్రల్లా మరణించి వారం దాటినా, ఇంకా అంత్యక్రియాలకు సంబంధించి ప్రణాళికల్ని హిజ్బుల్లా ప్రకటించలేదు. అతడి చివరి ఖనన ప్రదేశం లెబనాన్ లేదా ఇరాక్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. ఇరాక్ ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్ సుడానీ సలహాదారు అబ్దుల్ అమీర్ అల్ టెయిబాన్ ఇటీవల.. షియా ముస్లిం సమాజానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఇరాక్‌లోని ‘‘ఇమామ్ హుస్సేన్ పక్కన, కర్బాలాలో’’ నస్రల్లాని ఖననం చేస్తారని ట్వీట్ చేశారు.
అయితే, నస్రల్లా అంత్యక్రియలు నిర్వహించడానికి లెబనీస్ మధ్యవర్తులు అమెరికా నాయకుల నుంచి హామీని కోరినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కొనసాగుతన్న ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో అలాంటి హామీలు ఏమీ పొందలేదని లెబనీస్ అధికారి వెల్లడించారు. మూడు దశాబ్ధాలకు పైగా హిజ్బుల్లాకు చీఫ్‌గా ఉన్న నస్రల్లాని బీరూట్ దక్షిణ ప్రాంతంలోని బంకర్‌లో ఉండగా, ఇజ్రాయిల్ బంకర్ బస్టర్ బాంబుల్ని వాడి చంపేసింది. పేలుడు కారణంగా విషపూరితమైన పొగ నస్రల్లా ఊపిరి పీల్చుకోకుండా చేసిందని, దీంతోనే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు.