Asteroid 2024 YR4: 2024 YR4 అనే గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోంది. దీని వల్ల భూమికి రిస్క్ ఉంటుందని ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళనచెందుతున్నారు. ‘‘సిటీ కిల్లర్’’గా పిలుస్తున్న ఈ ఆస్టారాయిడ్ 2032లో భూమిని ఢీకునే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. ఈ అంతరిక్ష వస్తువు 130-300 అడుగుల వెడల్పు ఉంటుందని, ఇది జనసాంద్రత కలిగిన ప్రాంతాలను తాకితే భారీ విపత్తు తప్పకపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని గమనాన్ని నిశితంగా గమనిస్తున్నారు.
ది ప్లానెటరీ సొసైటీ చీఫ్ సైంటిస్ట్ బ్రూస్ బెట్ట్స్ ప్రకారం.. ఈ గ్రహశకలం పారిస్, లండన్, న్యూయార్క్ మీద పడితే మొత్తం ఆ నగరాలే ధ్వంసమవుతాయని చెప్పారు. అయితే, భూమిని ఢీకొట్టే అవకాశం 3.1 శాతం నుంచి 1.5 శాతానికి నాసా తగ్గించింది.
గ్రహశకలాన్ని అడ్డుకునేందుకు నాసా ప్లాన్స్:
ఒక వేళ ఈ గ్రహశకలంతో భూమికి ముప్పు వాటిల్లితే, దీనిని అడ్డుకునేందుకు నాసా ఇప్పటికే రంగం సిద్ధం చేస్తోంది. ఆస్టారాయిడ్‌ని ధ్వంసం చేసేందుకు నాసా, చైనాకు చెందిన CNSA, రష్యాకు చెందిన రోస్కోస్మోస్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వంటి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే, పేలుడు పదార్థాలు కలిగిన రాకెట్‌లను ఉపయోగించి దానిని గమనాన్ని భూమి నుంచి పక్కకు తప్పించడం లేదా పూర్తిగా నాశనం చేయవచ్చు.
దీనిని నాశనం చేయడం సులభం అవుతుందని నాసాకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. అయితే, పేలుడు పదార్థాలను సరైన సమయంలో, సరైన కోణంలో ఢీకొట్టేలా చేయడమనే ఇక్కడ కష్టమైన భాగమని చెప్పాడు.
YR4 గ్రహ శకలం దేనితో తయారైందనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. 2013లో రష్యాలోని చెల్కాబిన్స్క్‌ని ఢీకొట్టిన గ్రహశకలం పోరస్ పదార్థంతో చేయబడితే, ఇది భూమి వాతావరణంలోకి చేరిన వెంటనే, వాతావరణ ఘర్షణ కారణంగా సులభంగా విచ్ఛిన్నమవుతుంది. అయితే, కఠినమైన రాయి లేదా ఏదైనా లోహాన్ని కలిగి ఉంటే మాత్రం దీనిని విచ్ఛిన్నం చేయడానికి భారీగా శక్తి అవసరం అవుతుంది. అయితే, అణువార్ హెడ్స్ ఉపయోగించడం వంటి ప్లాన్స్ నాసా లిస్టులో ఉన్నాయో లేదో ధృవీకరించలేదు.