Nancy Pelosi Taiwan Visit: అమెరికా ప్రతినిధుల సభ్య స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన అమెరికా, చైనాల మధ్య అగ్గిరాజేసింది. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిప్పులో చెలగాటమాడుతున్నారని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండా బుధవారం నాన్సీ పెలోసీ తైవాన్ ను సందర్శించారు. ఇదిలా ఉంటే ఆమె పర్యటనపై రష్యా స్పందించింది. పెలోసీ పర్యటన ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉందని.. దీన్ని తక్కువగా అంచానా వేయకూడదని.. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. ప్రపంచ యుద్దానికి దగ్గరగా ఉందా.. అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే ప్రపంచ యుద్ధం అనే పదాన్ని నేను ఉపయోగించనని.. అయితే ఇది రెచ్చగొట్టే చర్యే అని ఆయన అన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని ఆయన వెల్లడించారు.
Read Also: UK PM Race: పుంజుకుంటున్న రిషి సునక్.. లిజ్ ట్రస్ కు గట్టి పోటీ..
ఇప్పటికే రష్యాపై అమెరికా అనేక ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాను అమెరికా, పాశ్చత్య దేశాాలు ఆంక్షల బంధంలో ఇరికించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శించి అగ్గిరాజేశారు. నాన్సీ పెలోసీ పర్యటన సందర్భంగా చైనా, తైవాన్ ద్వీపం చుట్టూ సైనిక, యుద్ధ విన్యాసాలను చేసింది. ఏకంగా పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ విమానాలు తైవాన్ గగన తలాన్ని ఉల్లంఘించాయి. ఇటు తైవాన్ కూడా యుద్ధానికి సిద్ధం అన్న రీతిలో ప్రతిస్పందించింది. వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని చైనా వాదిస్తోంది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తే ఎలాంటి చర్యలైేనా తీసుకుంటామని.. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు.