చైనాపై ట్రంప్ విధించిన సుంకాలను టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ తీవ్రంగా తప్పుపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మనసు మార్చుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యక్తిగతంగా ట్రంప్‌ను కోరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. చైనా దిగుమతులపై విధించిన కొత్త సుంకాలను వెనక్కి తీసుకోవాలని ట్రంప్‌ను వ్యక్తిగతంగా కోరినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. చైనా వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ బెదిరించడంతో.. సోషల్ మీడియా ద్వారా తన వ్యతిరేకతను మస్క్ వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ట్రంప్‌తో మస్క్ నేరుగానే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదని సమాచారం.
ఇది కూడా చదవండి: Massive theft at Kia Motors: కియా పరిశ్రమలో భారీ చోరీ.. 900 కారు ఇంజిన్లు మాయం
ట్రంప్ విధించిన సుంకాలకు ధీటుగా చైనా కూడా 34 శాతం సుంకాలు విధించింది. ఈ వ్యవహారం ట్రంప్‌నకు కోపం తెప్పించింది. దీంతో సోమవారం ట్రంప్ మాట్లాడుతూ.. చైనాపై 50 శాతం సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ విధానాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని మస్క్ ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే టెస్లా కార్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ వస్తువులు చైనా నుంచే దిగుమతి అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే చైనాపై సుంకాలు ఎత్తేయాలని మస్క్ కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ట్రంప్ నిర్ణయాలను ఆర్థిక నిపుణులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు