Titan Tragedy: టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు వెళ్లిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్ ఈ ఏడాది జూన్‌లో ప్రమాదానికి గురైంది. అట్లాంటిక్ సముద్రంలో దాదాపుగా 4 కిలోమీటర్ల అడుగులో ఒక్కసారిగా ఇన్‌ప్లోజన్ అనే పేలుడుకు గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రమాణిస్తున్న ఐదుగురు మరణించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో టైటానిక్ షిప్ ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురై వందలమంది ప్రయాణికులు మరణానికి కారణమైంది. దానిని చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కూడా ప్రమాదానికి గురవ్వడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కలిగింది.
ఇదిలా ఉంటే దీనిపై సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషాదకర సంఘటనను ‘ బ్లాకెనింగ్’ నిర్మాత ఇ బ్రియాన్ డాబిన్స్ మరియు మైండ్‌రైట్ ఎంటర్టైన్మెంట్ కలిసి రూపొందిస్తున్నట్లు వెరైటీ అవుట్‌లెట్ ఓ నివేదికలో తెలియజేసింది. డాబిన్స్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తారని, మాక్‌గ్రెరర్-జోనాథన్ కీసీలు కథను సిద్ధం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
టైటాన్ ట్రాజెడీపై రూపొందుతున్న తొలి ఫీచర్ ఫిల్మ్ ఇదే. అంతకుముందు యూకేకు చెందిన ఛానెల్ 5 దీనిపై ‘టైటానిక్ సబ్: లాస్ట్ ఎట్ సీ’ పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనికి టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఆయన కొట్టిపారేశారు.
ఈ ఏడాది జూన్ నెలలో ఓషన్ గేట్ సంస్థ తన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ద్వారా ఓషన్ గేట్ సీఈఓ స్టాక్‌టన్ రష్, బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్ అతని 19 ఏళ్ల కొడుకు సులేమాన్, ఫ్రెంచ్ నేవీ మాజీ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్ ఈ ఐదుగురు టైటాన్ ద్వారా టైటానిక్ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లారు.
అయితే దాదాపుగా గంటన్నర ప్రయాణం తర్వాత 4 కిలోమీటర్ల లోతుకు చేరగానే టైటాన్ నీటి ఒత్తడిని తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయింది. క్షణాల వ్యవధిలో ఈ ప్రమాదం సంభవించడంతో అందులో ఉండే ప్రయాణికులకు తాము చనిపోతున్నామనే విషయం కూడా తెలియకుండా పోయింది. టైటాన్ ఆచూకీ కోసం నాలుగు రోజుల వెతుకులాట తర్వాత అట్లాంటిక్ అడుగు భాగాన శిథిలాలను గుర్తించి పైకి తీసుకువచ్చారు.