Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల
- అనుమానాల వేళ వైరల్
- పాతదా? కొత్తదా? తేలాల్సి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కొందరు తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకొందరు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని రకరకాలైన పుకార్లు వచ్చాయి. ఇటీవల తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంతో అనేక రకాలైన అనుమానాలు రేకెత్తాయి. అసలు బ్రతికున్నారా? లేదా? సందేహాలు వచ్చాయి. తాజాగా మోజ్తబా ఖమేనీకి చెందిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వీడుతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా అలీ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియోను విడుదల చేసింది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు వార్తలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read
ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఈ వీడియోను విడుదల చేసింది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు. సుమారు 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఓ మతపరమైన అకడమిక్ అధ్యయన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నట్లు వీడియోలో కనిపించారు. ఓ విద్యార్థి తన థీసిస్‌ను సమర్పిస్తుండగా ఆయన దానిని వింటూ.. అనంతరం ఆ పరిశోధనను మూల్యాంకనం చేశారు.
విద్యార్థికి 19.5 మార్కులు
వీడియోలో మోజ్తబా ఖమేనీ విద్యార్థి సమర్పించిన థీసిస్‌కు 20 మార్కులకు 19.5 మార్కులు ఇచ్చారు. ఆ పరిశోధనను “లోపాలు లేనిది”గా అభివర్ణించారు. అలాగే ఇరాన్ పాలనా వ్యవస్థకు సంబంధించిన “ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్”పై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే దానిపై స్పష్టత లేదు. ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి మోజ్తబా ఖమేనీ బహిరంగంగా పెద్దగా కనిపించకపోవడంతో ఈ వీడియోపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారా?
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి జరిపిన దాడుల్లో మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ఈ దాడుల్లో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. అనంతరం మోజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాడుల్లో మోజ్తబా ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో రాయిటర్స్ వెల్లడించిన కథనం ప్రకారం.. టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ సముదాయంపై జరిగిన దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకటి లేదా రెండు కాళ్లకు గణనీయమైన గాయాలు అయినట్లు సమాచారం. అయితే గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని, మానసికంగా మాత్రం పూర్తి స్పష్టతతో ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. ఉన్నతాధికారులతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటున్నారని, అమెరికాతో యుద్ధం, చర్చలు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపింది.
అనుమానాల వేళ వీడియో
తాజాగా విడుదలైన వీడియో మోజ్తబా ఖమేనీ బహిరంగ కార్యకలాపాలకు సంబంధించిన అరుదైన దృశ్యాలను అందిస్తోంది. ఆయన మతపరమైన, అకడమిక్ కార్యక్రమాల్లో కొనసాగుతున్నారనే సంకేతాన్ని ఇది సూచిస్తోంది. అయితే వీడియో పాతదా, ఇటీవలిదా అనే విషయం స్వతంత్రంగా నిర్ధారించలేకపోవడంతో ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత రాలేదు.
మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్.. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు, ఆదాయ వనరులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలను కొనసాగించే దేశాలు, సంస్థలు కూడా సెకండరీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరిస్తోంది. మరోవైపు హార్ముజ్ జలసంధి కూడా ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా కొనసాగుతోంది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలకమైన ఈ మార్గం విషయంలో ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోజ్తబా ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల కావడం.. ఆయన ఆరోగ్యం, బహిరంగ పాత్ర, ఇరాన్ కీలక నిర్ణయాల్లో ఆయన ప్రమేయంపై మరోసారి చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Iran’s Supreme Leader Mojtaba Khamenei in FIRST-TIME-SEEN footage
Released publicly for the first time by Iranian media, footage shows him presiding over a religious academic study session pic.twitter.com/iIIl0pLAgS
— RT Intl (@RT_on_X) August 24, 2026
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!