Legionnaire’s disease in Argentine: ప్రపంచాన్ని కొత్తకొత్త వ్యాధులు చుట్టుముడుతున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి లాటిన్ అమెరికా దేశం అయిన అర్జెంటీనాలో ప్రబలుతోంది. లిజియోనెల్లా బ్యాక్టీరియా ద్వారా వచ్చే లెజియోనైర్స్ వ్యాధి బారిన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన 11 మంది పడగా.. నలుగురు మరణించారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు ఉత్తరాన 670 మైళ్ల దూరంలో ఉన్న శాన్ మిగ్యుల్ డి టుకుమాన్ నగరంలో ఈ వ్యాధి వ్యాపించింది.
శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ వ్యాధిని గుర్తించేందుకు ముందుగా కోవిడ్, స్వైన్ ఫ్లూ, హంటా వైరస్ కు సంబంధించిన పరీక్షలు చేశారు. అయితే ఇవన్నీ నెగిటివ్ వచ్చాయి. నలుగురు బాధితులను క్షణ్ణంగా పరిశీలింగా లిజియోనెల్లా బ్యాక్టీరియా ద్వారా వచ్చే లిజియోనైర్ వ్యాధిగా వైద్యులు తేల్చారు. మొత్తం 11 మందికి ఈ వ్యాధి సోకింది. ప్రస్తుతం నలుగురు మరణించగా.. మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, శరీర నొప్పులు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, డబుల్ న్యూమోనియా వంటి లెజియోనైర్స్ వ్యాధి లక్షణాలతో నలుగురు చనిపోయారని అర్జెంటీనా ఆరోగ్య మంత్రి కార్లా విజ్జోట్టి తెలిపారు.
Read Also: Puducherry: తన కొడుకే ఫస్ట్ రావాలని.. వేరే విద్యార్థికి విషమిచ్చి చంపిన తల్లి
బ్యాక్టీరియా ఉన్న నీటిని పీల్చుకున్నప్పుడు.. బ్యాక్టీరియా ఉన్న నీరు ఉపిరితిత్తుల్లోకి చేరినప్పుడు లెజియోనైర్స్ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా తీవ్రమైన న్యూమోనియాకు దారితీస్తుంది. ఫలితంగా రోగి శ్వాసతీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడి మరణిస్తాడు. ఇది సాధారణంగా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకదని వైద్యులు తెలియజేస్తున్నారు. యూఎస్ఏలోని ఫిలడెల్ఫియాలో 1976లో ఈ వ్యాధి మొదటిసారిగా గుర్తించారు. నీరు, అపరిశుభ్రమైన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.