Kim Jong Un ordered to increase the capacity of North Korean missiles: అమెరికా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్తగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, పెద్ద అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చాడు. ఇటీవల కాలంలో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అధికార వర్కర్స్ పార్టీ సమావేశంలో ఉత్తర కొరియా సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకోవడానికి అధిక సైనిక శక్తి ఉండాల్సిన అవసరాన్ని కిమ్ జోంగ్ ఉన్ నొక్కి చెప్పారు.
Read Also: Annavaram Temple: సత్యదేవుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు
ఉత్తర కొరియాకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు కిమ్. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వరసగా క్షిపణి ప్రయోగాలను చేపడుతున్నాడు. నిన్న శనివారం మూడు క్షిపణులను ప్రయోగించిన నార్త్ కొరియా, న్యూఇయర్ తొలిరోజు ఆదివారం మరో క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల అమెరికా సైనిక విన్యాసాలు చేసింది. దీంతో అంతే ధీటుగా నార్త్ కొరియా కూడా సిద్ధం అవుతోంది.
దక్షిణ కొరియా మా శత్రువు అని కిమ్ అన్నారు. శత్రువుల నుంచి ఎదురయ్యే అణు ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్(ఐసీబీఎం) వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని ఆయన సూచించారు. ఉత్తర కొరియా 2022లో ఎక్కువగా క్షిపణులను ప్రయోగించింది. ఉత్తర కొరియా 2017లో మొదటిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ‘‘హాస్వాంగ్-17’’గా పిలువబడుతున్న ఈ క్షిపణి అమెరికాలో ఎక్కడైనా దాడి చేయగలదు.