Kim Jong Un: అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు ఒత్తిడిని లెక్క చేయకుండా ఉత్తకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు. కిమ్ తన ప్రత్యేక రైలులో ఉత్తర కొరియా నుంచి రష్యాలో వ్లాదివోస్టోక్‌కి ఆదివారం వెళ్లారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు రష్యా చేరిందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ రియా నోవోస్తీ మంగళవారం తెలిపింది. కిమ్ రైలు మంగళవారం రష్యాలోకి ప్రవేశించిందని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: RSS: ఆర్ఎస్ఎస్‌కి కేరళ హైకోర్ట్ షాక్.. ఆలయంలో ఆయుధ శిక్షణపై నిషేధం..
నాలుగేళ్ల తర్వాత కిమ్ చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇదే. రష్యా, ఉత్తరకొరియాల మధ్య ఆయుధ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవాలని అనుకుంటోంది. బదులుగా ఉత్తరకొరియాకు రష్యా శాటిలైట్, అణుజలాంర్గామి టెక్నాలజీని ఇవ్వబోతోంది. రష్యా, ఉత్తర కొరియా నుంచి ఆర్టిలరీ షెల్స్, యాంటీ ట్యాంక్ క్షిపణులను కోరుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం పుతిన్ వార్షిక ఆర్థిక ఫోరమ్ సమావేశాల కోసం వ్లాడివోస్టాక్ లో ఉన్నారు. ఇద్దరు దేశాధినేతలు సున్నితమైన విషయాలపై చర్చిస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ సమావేశంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కోసం నార్త్ కొరియా ఆయుధాలను సరఫరా చేస్తే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మా పొరుగు దేశం ఉత్తరకొరియాతో సంబంధాలను నిర్మించుకోవడమే మాకు ముఖ్యమమని, అమెరికా హెచ్చరికలు కాదని పెస్కోవ్ అన్నారు.