Anti-Hijab Protest: ఇరాన్‌లో హిజాబ్ వ్యవహారం రోజురోజుకు తీవ్రమవుతోంది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంగా అరెస్టయి పోలీసుల కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఉదంతంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఇరాన్ మహిళలతో పాటు కొందరు యువకులు రోడ్ల మీదికొచ్చి ఆందోళనలు చేపట్టారు. మరో యువతి హదీస్ నజాఫీని ఇరాన్ భద్రతా దళాలు కాల్చి చంపడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.
హిజాబ్ వ్యతిరేక నిరసనలు నాలుగో వారంలోకి ప్రవేశించడంతో ఓ పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టిన అనేక మంది విద్యార్థులను ఆ దేశ భద్రతా దళాలు అరెస్ట్ చేసినట్లు గార్డియన్ నివేదించింది. అలాగే, ఇరాన్ అధికారులు కుర్దిస్తాన్‌లోని అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలను ఆదివారం మూసివేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఆ దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై వివక్షపూరిత చట్టాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కరాజ్ పట్టణంలో ఓ ప్రభుత్వాధికారికి వ్యతిరేకంగా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ వాటర్ బాటిల్స్ అతనిపై విసిరేశారు. ఇక ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటి వరకూ 185 మంది మరణించినట్లు ఇరాన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. మరణించిన వారితో 19 మంది పిల్లలు కూడా ఉన్నారు.
Anti Hijab Protest: అట్టుడుకున్న ఇరాన్.. భద్రతా దళాల కాల్పుల్లో 185మంది మృతి
ఈ ఆందోళనల్లో దాదాపు 20 మంది రివల్యూషనరీ గార్డులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఆందోళనకారులు ప్రభుత్వ టీవీ ప్రసారాలను హ్యాక్ చేశారు. వార్తలు ప్రసారమవుతున్న సమయంలో దేశ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ తలను టార్గెట్ చేస్తున్న చిత్రాలు టీవీ స్క్రీన్ మీద కనిపించాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీంరైసీ అల్-జహ్రా యూనివర్శిటీని సందర్శించినప్పుడు అక్కడి విద్యార్థినులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాలుగు వారాలుగా కొనసాగుతున్న నిరసనలు ఎప్పుడూ ఆగుతాయో వేచిచూడాల్సిందే.