కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పేద, ధనవంతులు, అధికారం, హోదాలు అడ్డుకాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. ప్రధానితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా ప్రధాని జెసిండాకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్ కు కరోనా అని తేలింది. అయితే అప్పటి నుంచి ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఆమెకు కూడా కరోనా సోకింది. ప్రధాని మూడేళ్ల కుమార్తె నీవ్ కు కూడా బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ఆంక్షల నేపథ్యంతో ప్రధాని తన పెళ్లిని కూడా రద్దు చేసుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఈ ఏడాది మొదట్లో న్యూజిలాండ్ లో పెద్ద ఎత్తున కేసులు పెరిగాయి.
ఇదిలా ఉంటే రాబోయే వారంలో న్యూజిలాండ్ వార్షిక బడ్జెట్, గ్రీన్ హౌజ్ గ్యాస్, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన తరుణంలో ఆమె కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె రాజధాని వెల్లింగ్టన్ లో ఐసోలేషన్ లో ఉంటున్నారు. న్యూజిలాండ్ లోని ఆరోగ్య నిబంధనల ప్రకారం కుటుంబంలో ఎవరికైనా కరోనా అని తేలితే.. వారు వారం పాటు ఒంటరిగా ఉండాలి. ఇదిలా ఉంటే వచ్చే సోమవారం కర్భన ఉద్గారాల తగ్గింపు, గురువారం న్యూజిలాండ్ బడ్జెట్ విడుదల సమయంలో ప్రధాని జెసిండా అందుబాలులో ఉండే అవకాశం లేదు. కరోనా మొదలైనప్పటి నుంచి న్యూజిలాండ్ లో 10,26,715 కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచంలో పలువురు దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనాతో వారం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా బిలియనీర్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా కరోనా జాబితాలో చేరారు.