Israel Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఘర్షణ తీవ్రమవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు, ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది. దీనికి ప్రతిగా, ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయిల్ లోని జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలను టార్గెట్ చేస్తూ క్షిపణి దాడులు నిర్వహించింది. ఇరుదేశాలు కూడా ఒకరిపై ఒకరు వైమానిక దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఇరాన్ వైపు 224 మంది మరణించగా, ఇజ్రాయిల్‌లో 24 మంది మరణించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌ని చైనా టార్గెట్ చేసింది. ఇజ్రాయిల్-ఇరాన్ వివాదంపై ఆజ్యం పోస్తున్నాడని చైనా మంగళవారం ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు టెహ్రాన్‌లోని నివాసితులను వెంటనే ఖాళీ చేయమని హెచ్చరించిన తర్వాత డ్రాగన్ కంట్రీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ‘‘ మంటలు ఆర్పడానికి బదులుగా నూనె పోయడం, బెదిరింపులు, పెరుగుతున్న ఒత్తిడి పరిస్థితిని తగ్గించదు. ఇది సంఘర్షణను తీవ్రం చేస్తుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్‌ని ట్రంప్ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఐదో రోజుకు ఘర్షణ చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యుద్ధం తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో అందరూ వెంటనే టెహ్రాన్‌ను విడిచి వెళ్లాలని కోరిన కొన్ని గంటల తర్వాత, మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని నగరంలో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు, జీ-7 సమావేశం కోసం కెనడా వెళ్లిన ట్రంప్, తన పర్యటనను కుదించుకుని అమెరికా తిరిగి వచ్చారు. అణు ఒప్పందం మరియు సంఘర్షణ ముగింపు గురించి చర్చించడానికి ట్రంప్ మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్ మరియు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సమావేశమయ్యే అవకాశం ఉందని ఆక్సియోస్ నివేదించింది.