Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేసింది. మరో 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి రావడంతో కొందరు బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గత వారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ముగియడంతో మరోసారి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ దాడుల వల్ల 17 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో దాదాపుగా 40 శాతం మంది చిన్న పిల్లలు ఉండటంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
READ ALSO: Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ భద్రతపై అధికారుల సమీక్ష..
ఇదిలా ఉంటే ఈ యుద్ధంలో మొదటినుంచి ఇజ్రాయిల్‌ని సపోర్టు చేస్తున్న అమెరికా తొలిసారి, ఆ దేశ వైఖరిని విమర్శించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. పాలస్తీనా పౌరులను కాపాడుతామని ఇజ్రాయిల్ చెప్పిన మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అమెరికా, ఇజ్రాయిల్‌కి బలమైన హెచ్చరిలకు జారీ చేసింది. గాజా స్ట్రిప్‌లో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ జాన్ ఫినెర్ ‘ఆస్పెన్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్’లో మాట్లాడుతూ.. హమాస్ గాజాను ఏ మాత్రం పాలించలేదని అన్నారు. అక్టోబర్ 7 ఘటన తర్వాత ఇజ్రాయిల్ పెట్టుకున్న లక్ష్యాల్లో ఇది కూడా ఒకటని చెప్పారు. హమాస్ ఉగ్రసంస్థను నిర్మూలించాలనేది మరో లక్ష్యమని చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపితే హమాస్ ముప్పు పూర్తిగా తొలిగిపోదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయిల్‌ని యుద్దం ఆపాలనే పరిస్థితి ఇంకా రాలేదని చెప్పారు.