ISIS: సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడుల్లో 30 మంది ప్రభుత్వ అనుకూల సైనికులు మరణించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి. ‘‘బుధవారం సిరియాలోని చెక్ పోస్టులు, సైనిక స్థావరాలపై ఐసిస్ ఉగ్రవాదులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో 30 మంది మరణించారు. వీరిలో నలుగురు సైనికులు ఉండగా.. 26 మంది నేషనల్ డిఫెన్స్ ఫోర్సుకు చెందిన వ్యక్తులు ఉన్నారు’’ అని బ్రిటన్ లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమర్ రైట్స్ తెలిపింది.
రాఖా, హోమ్స్, డీర్ ఎజోర్ మధ్య ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయి. అయితే క్షతగాత్రుల సంఖ్య పేర్కొనలేదు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. రష్యా యుద్ధ విమానాలు ఎడారిలోని ఐసిస్ స్థావరాలపై దాడి చేశాయని, జీహాదీలకు కూడా ప్రాణనష్టం జరిగినట్లు సిరియన్ అజ్జర్వేటరీ తెలిపింది.
Read Also: Parliament’s Winter session: డిసెంబర్ రెండో వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..?
2014 జూన్ నెలలో సిరియా, ఇరాక్ కలిపి ‘కాలిఫేట్’ ఏర్పాటు చేసినట్లుగా ఐసిస్ ప్రకటించింది. అయితే 2019లో ప్రభుత్వ బలగాలు ఐసిస్ ని నేలకూల్చి వారి ఆక్రమణలో ఉన్న ప్రదేశాలను తిరిగి తీసుకుంది. అప్పటి నుంచి ప్రభుత్వ అనుకూల దళాలతో పాటు కుర్దిష్ ఫైటర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఐసిస్ దాడులకు తెగబడుతోంది. ఆగస్టు నెలలో ఇలాగే డీర్ ఎజోర్ ప్రావిన్సులో మయాదీన్ సమీపంలో బస్సుపై మెరుపుదాడి చేయడంతో 33 మంది సిరియన్ సైనికులు మరణించారు. రెండు రోజుల క్రితం రఖాలోని ఐసిస్ దాడులు వల్ల 10 మంది మరణించారు.
ఆగస్టు నెలలో ఐఎస్ తన నాయకుడు మరణించినట్లు ప్రకటించింది. అతని స్థానంలో అబూ హాఫ్స్ అల్-హషిమీ అల్-ఖురాషిని చీఫ్‌గా ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ 2011లో శాంతియుత ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను అణిచివేయడంతో అక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడ జీహాదీ ఉద్యమం బలపడింది. ఈ సంఘర్షణ 5 లక్షల మంది చనిపోయారు. చాలా మంది ప్రజలు తమ సొంత ప్రాంతాల నుంచి వలసలు వెళ్లారు.