Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తరుచుగా ఆందోళన పేరుతో విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ గూఢాచార సంస్థఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఇటీవల పంజాబ్‌లోని క్రియాశీల నేరస్థులకు, ఖలిస్తానీ ఉగ్రవాదులకు సాయం చేస్తోంది. పోర్చుగల్ నుంచి అక్రమ ఆయుధాలను పంపినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు స్థావరాలు ఉండగా.. కొత్తగా పోర్చుగల్ లో స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read Also: Resomation: నీటిలో అంత్యక్రియలు.. పలు దేశాల్లో వినియోగం.. ఇప్పుడు బ్రిటన్‌లో అందుబాటులోకి
పోర్చుగల్ లో నివసిస్తున్న ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు అందించడంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఆయుధాలు, నిధులను పంజాబ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నేర కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాదిని కొద్ది రోజుల క్రితం పోర్చుగల్‌లో పట్టుకోవడంతో ఈ నెట్‌వర్క్ మొత్తం బయటకు వచ్చింది. టూరిస్ట్ వీసాపై దేశంలో ఉంటున్న వ్యక్తి వద్ద నుంచి AK-47, MP-5 సబ్‌మెషిన్ గన్, హ్యాండ్ గ్రెనేడ్‌లు, పిస్టల్స్ లభించాయి. పంజాబ్‌లోని చురుకైన నేరస్థులకు ఈ ఆయుధాలను అందజేసే బాధ్యతను ఐఎస్‌ఐ అతనికి అప్పగించిందని అతను తెలిపాడు.
ఇదిలా ఉంటే కెనడాలో జూలై 8న ఖలిస్తాన్ అనుకూల ఆందోళనలు జరగనున్నాయి. దీనిపై భారత్ కెనడా రాయబారి కామెరూన్ మాకేకి సమన్లు జారీ చేసింది. కెనడాలోని అట్టావా, టొరంటో, వాంకోవర్ లోని భారతీయ రాయబార కార్యాలయాల ముందు నిరసన తెలిపేందుకు ప్లాన్ చేశాయి. అంతకుముందు కొందరు భారతీయ రాయబార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాదులు పోస్టర్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పాకిస్తాన్, కెనడా, బ్రిటన్ లో ఉన్న ఖలిస్తానీ టెర్రరిస్టులను ఏకీకృతం చేయడంతో పాటు పలువురు క్రిమినల్స్ ని రిక్రూట్ చేసే పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.