US Iran Conflict: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో.. టెహ్రాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. సుదూర ప్రయాణ సామర్థ్యం కలిగిన RQ-4, MQ-9 డ్రోన్లు ఉన్న హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు వెల్లడించింది. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరంపైనా భారీ డ్రోన్ దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీలో ప్రసారమైన ప్రకటనలో.. దాడుల్లో పలు డ్రోన్లు ధ్వంసమైనట్లు, అమెరికా విమాన, సాంకేతిక సిబ్బందిలో కొందరు మరణించినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. సైనిక స్థావరంలోని సాంకేతిక మౌలిక సదుపాయాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నిప్పంటుకున్నట్లు తెలిపింది. అయితే ఈ వాదనలపై అమెరికా, జోర్డాన్ నుంచి తక్షణ అధికారిక ధృవీకరణ రాలేదు.
అమెరికా వరుస దాడులు
మరోవైపు హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఐఆర్‌జీసీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడులు కొనసాగించాయి. రెండు రోజుల్లోనే రెండోసారి ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య చేపట్టడం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడానికి కారణమైందని చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా ‘భారీ, శక్తివంతమైన’ దాడులు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎలాంటి ప్రతీకార చర్యకు దిగినా ఇరాన్‌పై మరింత తీవ్రంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ఏర్పాటు చేసేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నం, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన క్షిపణి దాడికి ప్రతిస్పందనగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ వెల్లడించారు.
జోర్డాన్‌లో సైరన్ల మోత
ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో జోర్డాన్‌లో అత్యవసర సైరన్లు మోగాయి. మఫ్రాక్ ప్రాంతంలో రాకెట్లను అడ్డుకున్నట్లు జోర్డాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. జోర్డాన్ నగరంలోనూ కొన్ని రాకెట్లను అడ్డుకున్నట్లు అల్ జజీరా అరబిక్ వెల్లడించింది. ఈ పరిణామాలు ఆరు నెలలుగా కొనసాగుతున్న సంఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చే అవకాశాలను పెంచాయి. ఇప్పటికే ఈ ఘర్షణ ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సోమవారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ప్రారంభంలోనే 2 శాతం మేర పెరగగా.. దాడుల వార్తల తర్వాత మరోసారి దాదాపు 2 శాతం పెరిగాయి.
చమురు ఎగుమతులపై ఇరాన్ కీలక నిర్ణయం
గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను నిలిపివేస్తామని ఇరాన్ ప్రకటించినట్లు సమాచారం. ఇరాన్ తాజా దాడులకు ప్రతిస్పందనగా మరింత తీవ్రమైన సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ కూడా ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇరాన్‌లోని ఐఆర్‌జీసీకి చెందిన పలు లక్ష్యాలపై అమెరికా దళాలు దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, అక్కడ మోహరించిన అమెరికా సైనిక సిబ్బందిపై ఐఆర్‌జీసీ దాడులు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఇరాన్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
హోర్ముజ్ జలసంధి ఉత్తర ప్రాంతంలోని ఖేష్మ్ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జాస్క్, సిరిక్ ప్రాంతాల్లోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. దక్షిణ ఇరాన్‌లోని జిరోఫ్ట్‌లో ఓ పౌర విమానాశ్రయంపై కూడా అమెరికా దాడి చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. తమపై అమెరికా చేపట్టిన తాజా దాడులకు ఆ దేశం పశ్చాత్తాపపడేలా చేస్తామని ఐఆర్‌జీసీ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అమెరికా – ఇరాన్ మధ్య వరుసగా జరుగుతున్న ఈ దాడులతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ చమురు సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది.

