United Nations: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన చేసిన విచక్షణారహిత దాడితో ఆరంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆరంభించడం మీకు తెలుసు కానీ ఆపడం మాకు తెలియదు అన్నట్లు ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడులతో విరుచుకుపడుతుంది. ఇరు దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలకి అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఈ మారణహోమాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఐక్యరాజ్యసమితి తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మాన సభను UN జనరల్ అసెంబ్లీలో ఏర్పాటు చేసింది. ఇది గాజా స్ట్రిప్‌లో ఎటువంటి అవరోధం లేకుండా మానవతావాద ప్రవేశానికి పిలుపునిచ్చింది. కాగా ఈ సమావేశానికి భారత్‌తో పాటు పలు దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్ మరియు యుకెలు గైర్హాజరైయ్యాయి. కాగా 10వ అత్యవసర ప్రత్యేక సెషన్‌లో జోర్డాన్ సమర్పించిన ముసాయిదా తీర్మానంపై సెషన్‌లో సమావేశమైన UN జనరల్ అసెంబ్లీ (UNGA)లోని 193 మంది సభ్యులు ఓటు వేశారు.
Read also:Elon Musk: డేటింగ్ యాప్ గా మారబోతున్న ట్విటర్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్తాన్, రష్యా మరియు దక్షిణాఫ్రికాతో సహా 40 కంటే ఎక్కువ దేశాలు సహ స్పాన్సర్ చేశాయి. “పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలను సమర్థించడం” అనే శీర్షికతో తీర్మానం ఆమోదించబడింది. కాగా జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడులతో యుద్దానికి కారణమైన హమాస్ పేరు తీర్మానంలో ప్రస్తావించకపోవడంచేత చెడును విస్మరించడం సబబుకాదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గాజాలో “తక్షణ మానవతా సంధికి ఇచ్చిన పిలుపును హమాస్ స్వాగతించింది. అయితే ఇజ్రాయెల్ మరియు యుఎస్ హమాస్ గురించి ప్రస్తావించకపోవడంచేత తీర్మానాన్ని విమర్శించాయి. దీనికి UN సభ్యుల నుండి అనుకూలంగా 120 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లు రాగ 45 దేశాలు గైర్హాజరయ్యాయి.