India “Tracking” China Spy Ship Ahead Of Missile Launch: భారతదేశంపై చైనా తీరు మార్చుకోవడం లేదు. భారత్ పై నిఘాను పెంచేందుకు చైనా గూఢాచర నౌకలు తరుచుగా హిందూ మహాసముద్రానికి వస్తున్నాయి. మూడు నెలల క్రితం ఇలాగే చైనాకు చెందిన గూఢాచారి నౌక యువాన్ వాంగ్ 5ని శ్రీలంకకు పంపింది చైనా. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పినా.. శ్రీలంక పట్టించుకోలేదు. హంబన్ టోటా ఓడరేవులో ఈ నౌకకు డాకింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో గూఢాచారి నౌక యవాన్ వాంగ్ 6ను గుర్తించింది భారత్. భారత నౌకాదళం గత కొన్ని రోజులుగా ఈ నౌక గమనాన్ని ట్రాక్ చేస్తోంది. యువాన్ వాంగ్ 6 ఇప్పటికే హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించినట్లు భారత్ తెలిపింది. మెరైన్ ట్రాఫిక్ ప్రకారం ప్రస్తుతం ఈ నౌక ఇండోనేషియా బాలి సమీపంలో ఉంది.
Read Also: K P Sharma Oli: తీరు మార్చుకోని నేపాల్.. భారత భూభాగాలు స్వాధీనం చేసుకుంటారంటా…
భారతదేశంలో కీలకమైన క్షిపణి ప్రయోగానికి సన్నద్ధం అవుతున్న వేళ ఈ నౌక వస్తోంది. నవంబర్ 10-11 మధ్య ఓడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి క్షిపణి ప్రయోగం జరగనుంది. 2,200 రేంజ్ కలిగిన ఈ క్షిపణిని పరీక్షించనుంది భారత్. ఈ సమయంలోనే చైనా గూఢాచారి నౌక భారత్ కు సమీపంగా వస్తోంది. యువాన్ వాంగ్ 6 క్షిపణులు, శాటిలైట్లపై నిఘా పెట్టే అవకాశం ఉంది. క్షిపణికి సంబంధించిన మార్గాన్ని, వేగం, పరిధి, కచ్చితత్వ వంటి సామర్థ్యాలను ఈ నౌక ట్రాక్ చేసే అవకాశం ఉందని భారత్ ఆందోళన చెందుతోంది.
శ్రీలంకలో హంబన్ టోటా పోర్టును 99 ఏళ్ల లీజుకు తీసుకుంది చైనా. అక్కడి నుంచి భారత్ పై నిఘా పెట్టే అవకాశం ఏర్పడింది. దీంతోనే భారత్ పదేపదే శ్రీలంకకు తమ అభ్యంతరాన్ని తెలియజేస్తోంది. శ్రీలంక అప్పుల్లో కూరుకుపోవడానికి పరోక్షంగా కారణం అయిన చైనాకు ఇంకా మద్దతు ఇస్తూనే ఉంది శ్రీలంక. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను అన్ని రకాలుగా ఆదుకున్న భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మనదేశం పెట్రోల్, మెడిసిన్, ఆహారాన్ని అందించింది.