Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘‘ప్రాణాలతోనే’’ ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ మరణించారని, ఆయనను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో, ఆయన శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అడియాలా జైలు ముందు పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ముగ్గురు చెల్లెళ్లు నిరసన తెలిపారు. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన సోదరీమణుల్ని, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రిని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
Read Also: Imran Khan: “మరణం” వార్తలకు చెక్.. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి..
తాజాగా, ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో కలిసేందుకు ఉజ్మా ఖాన్‌ను ప్రభుత్వం అనుమతించింది. దీంతో మంగళవారం సాయంత్రం ఆమె, తన సోదరుడిని కలిసింది. ఆయనను కలిసిన తర్వాత ఉజ్మా మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను మానసికంగా హింసిస్తున్నారని, అతడిని ఏకాంత నిర్బంధంలో ఉంచారని, ఆయన బాగానే ఉన్నాడని చెబుతూ, మరణం పుకార్లకు చెక్ పెట్టింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఎవరితో కలవనివ్వడం లేదని, వారు మానసికంగా హింసిస్తున్నారని, ఆయన కోపంతో ఉన్నారని, జరుగుతున్న ప్రతీ దానికి అసిమ్ మునీర్ బాధ్యుడని ఆయన అన్నట్లు ఆమె చెప్పారు.
అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌ను ఆగస్టు, 2023 నుంచి జైలులో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆయన మరణలు వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇస్లామాబాద్, రావల్పిండి లో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. పాక్ ప్రభుత్వం సమావేశాలను నిషేధించడంతో పాటు రావల్పిండిని సైన్యం, పోలీసులతో నింపేసింది.