Imran Khan: పాకిస్తాన్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆసిమ్ మునీర్‌కి ఇటీవల పాక్ ప్రభుత్వం ‘‘ఫీల్డ్ మార్షల్’’ పదవితో సత్కరించింది. యుద్ధంలో అసాధారణ వ్యూహాలు, సైనిక విజయాలు సాధించిన వారికి ఈ ప్రమోషన్ లభిస్తుంది. అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్‌కు బదులుగా తనను తాను “రాజు” అనే బిరుదును ఇచ్చుకోవాల్సిందని ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు.
Read Also: RGV : సినిమాల్లో బూతులు ఉంటే తప్పేంటి.. ఆర్జీవీ సంచలనం..
“మాషా అల్లాహ్, జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా నియమించారు. నిజం చెప్పాలంటే, అతనికి బదులుగా ‘రాజు’ అనే బిరుదు ఇవ్వడం మరింత సముచితంగా ఉండేది – ఎందుకంటే ప్రస్తుతం, దేశం అడవి చట్టం ద్వారా పాలించబడుతుంది. అడవిలో, ఒకే రాజు ఉంటాడు” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తనకు, సైన్యానికి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని, ఇది నిరాధారమైన ఆరోపణలుగా ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేశారు. పాకిస్తాన్ భవిష్యత్తుపై నిజంగా శ్రద్ధ ఉంటే తాను ఆర్మీలో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
భారత దేశం మరో దాడికి సిద్ధంగా ఉందని ఇమ్రాన్ ఖాన్, షహబాజ్ షరీఫ్‌ని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని అన్నారు. పాకిస్తాన్ చట్టం బలహీనులకు వర్తించేలా చేశారని, బలవంతుల్ని ఏం చేయడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని చంపేశానని అన్నారు. పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సోదరిపై కేసు ఉన్నప్పటికీ, ఆమెను ప్రశ్నించే ధైర్యం లేదని, మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న షహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నారని చెప్పారు.