ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావోస్తున్నది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఆ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. విదేశాల్లో ఆఫ్ఘన్ నిధులు ఫ్రీజ్ కావడంతో ఆర్థికంగా ఆ దేశం కుదేలయింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందక జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో చాలా మంది పిల్లల ఆకలి తీర్చేందుకు కిడ్నీలను అమ్ముకున్నారు. కాగా, ఇప్పుడు పిల్లల ఆకలి తీర్చలేక ఆ పిల్లలను బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు. తాలిబన్లు వశం చేసుకోవడానికి ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభం ఉన్నది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మరింతగా పెరిగిపోయింది.
Read: యూఎస్‌ను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్…
మరికొన్ని రోజులపాటు ఆహార సంక్షోభం లభించకపోతే సుమారు 10 లక్షల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ ఉద్యోగాలు కోల్పోవడంతో తినేందుకు తిండి దొరక్క అలమటిస్తున్నారు. ఆ దేశానికి ప్రధాన ఆదాయవనరు వ్యవసాయం. ఏడాది కాలంగా వ్యవసాయం లేకపోవడంతో పంటలు లేక ఆహారధాన్యాల కొరత తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌ను మానవతాహృదయంలో అనేక దేశాలు ఆదుకుంటున్నప్పటికీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో మరణమృదంగం తప్పదనేవిధంగా పరిస్థితులు మారిపోనున్నాయి.