Betelgeuse: శాస్త్రవేత్తలకు దశాబ్ధాలుగా బెటెల్గ్యూస్ (Betelgeuse) నక్షత్రం కొరకురాని కొయ్యగా మారింది. కొన్ని సందర్భాల్లో ఇది కాంతివంతంగా, మరికొన్ని సార్లు కాంతిహీనంగా ఉంటుంది. అయితే, ఇది ఏదో రోజు పేలిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా, నాసా హబుల్ టెలిస్కోప్ కూడా ఈ నక్షత్రం పేలిపోయేందుకు సిద్ధంగా ఉందని కనుగొంది. ఈ రెడ్ సూపర్‌జాయింట్ ‘‘సూపర్ నోవా’’లా పేలుతుందని ఇది వరకే శాస్త్రవేత్తలు చెప్పారు.
గత కొన్ని దశాబ్ధాలుగా బెటెల్గ్యూస్ వెనక భాగంలో ఒక తోకలాగా పొడవుగా విస్తరించిన గ్యాస్ ప్రవాహాన్ని శాస్త్రవేత్తలను అయోమయానికి గురి చేస్తోంది. ఈ గ్యాస్ తోక ఎందుకు అసమానంగా, వంకరగా ఉందనే దానికి సరైన సమాధానం లేదు. హబుల్ టెలిస్కోప్ తన అల్ట్రావయలెట్ ఇమేజింగ్ సామర్థ్యంతో బెటెల్గ్యూస్ చుట్టూ ఉన్న గ్యాస్ కదలికలను పరిశీలించింది. ఈ గ్యాస్ తోక గురుత్వాకర్షణ ప్రభావంతో వంకరగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Read Also: Bluefin Tuna: ఓడియమ్మ ట్యూనా ఫిష్.. వేలంలో రూ.29 కోట్లు పలికిన ట్యూనా ఫిష్.. అంత ప్రత్యేకత ఏంటంటే..!
బెటెల్గ్యూస్‌కు దగ్గరగా కానీ, ప్రత్యక్షంగా కనిపించని ఒక రహస్య సహచర నక్షత్రం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నక్షత్రం గురుత్వాకర్షణ కారణంగానే బెటెల్గ్యూస్ నుంచి వెలువడే గ్యాస్ ప్రవాహాన్ని మలుపులు తిప్పుతోందని హబుల్ సమాచారం సూచిస్తోంది. బెటెల్గ్యూస్‌కు సహచర నక్షత్రం ఉంటే, భవిష్యత్తులో జరిగే సూపర్ నోవా పేలుడు ఇప్పుడు ఊహించినదాని కన్నా భిన్నంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమికి 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ నక్షత్రం ఏకంగా మన సూర్యడి కన్నా చాలా పెద్దది. సూర్యడి కన్నా సుమారు 700 నుంచి 1000 రెట్లు పెద్దది. సూర్యుడి లాంటి నక్షత్రాలను సుమారు 30 కోట్లను బెటెల్గ్యూస్‌లో పెట్టవచ్చు. ఈ నక్షత్రాన్ని మన సౌరకుటుంబంలో సూర్యుడితో రీప్లేస్ చేస్తే, ఇది ఏకంగా కుజ గ్రహం లేదా గురుగ్రహం వరకు విస్తరిస్తుంది. అంటే బుధుడు, శుక్రుడు, భూమిని దాటి పోతుంది. ఇది ఒక వేళ పేలిపోతే చంద్రుడి కన్నా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్ని వారాల పాటు దీనిని మనం చూడొచ్చు.