Hassan Nasrallah: 30 ఏళ్లుగా ఇజ్రాయిల్‌కి సవాల్ విసురుతున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని శుక్రవారం వైమానికి దాడిలో హతమార్చింది. అత్యంతం గోప్యత పాటించే నస్రల్లాను టార్గెట్ చేసి బీరూట్‌పై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో నస్రల్లా మరణించాడు. ఇప్పుడు అతడి మరణం ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చింది. నస్రల్లాతో పాటు మిలిటరీ చైన్‌లోని అత్యంత కీలకమైన కమాండర్లు అందరిని ఇజ్రాయిల్ హతమార్చింది. ఫువాద్ షుక్ర్, అలీ కర్కీ, ఇబ్రహీం అఖిల్ ఇలా ఒక్కొక్కరుగా చనిపోయారు.
ఇదిలా ఉంటే, నస్రల్లా మరణమే ఇప్పుడు అందరిలో సంచలనంగా మారింది. తన ఉనికి కూడా బహిరంగ ప్రజానీకానికి తెలియనివ్వని నస్రల్లాకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఇజ్రాయిల్ సేకరించి దాడులు చేసింది. బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హిజ్బుల్లా సెంట్రల్ హెడ్‌క్వార్టర్‌లో కీలకమైన సమావేశానికి నస్రల్లా వస్తున్నాడనే సమాచారం, కేవలం దాడికి గంటల ముందు మాత్రమే ఇజ్రాయిల్ అధికారులకు అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఇన్ఫర్మేషన్‌ని కన్ఫార్మ్ చేసుకున్న ఇజ్రాయిల్ భారీ వైమానిక దాడి చేసింది.
అయితే, దాదాపుగా 60 అడుగుల లోతులో ఉన్న దుర్భేద్యమైన బంకర్‌లో నస్రల్లా ఉన్నా కూడా, అతడిని ఇజ్రాయిల్ చంపేసింది. ఇది ఎలా సాధ్యమైందనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఇందులోనే కీలకమైన సమావేశానికి నస్రల్లాతో పాటు ఇతర కీలక సభ్యులు హాజరయ్యారు. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా దాడి ప్లాన్ చేసేందుకు వీరంతా చర్చిస్తున్నారు. హిజ్బుల్లాతో పాటు ఇరాన్ సీనియర్ మిలిటరీ జనరల్ కూడా ఈ సమావేశానికి వచ్చాడు.
ఈ బంకర్‌ని నామరూపాలు లేకుండా చేయడానికి ఇజ్రాయిల్ సైన్యం 80 టన్ననులు పేలుడు పదార్థాలను ఉపయోగించింది. వీటిలో 85 ‘‘బంకర్-బస్టర్’’ బాంబులు ఉన్నాయి. ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉండే నిర్మాణాల్లోకి కూడా చొచ్చుకుపోతాయి. 30 మీటర్ల వరకు భూమి లేదా ఆరు మీటర్ల మందం ఉన్న రీన్‌ఫోర్స్డ్ కాంక్రీటు ద్వారా గుచ్చుకోగల సామర్థ్యం వీటి సొంతం. బంకర్ బస్టర్ బాంబుల బరువు 907 కిలోల నుంచి 1814 కిలోలు ఉంటాయి. ఈ బాంబుల్ని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అభివృద్ధి చేశారు.
‘‘మేము ప్లాన్ చేసిన ప్రతీది ఖచ్చితంగా అమలు చేయబడింది. ఎలాంటి లోపాలు లేకుండా ఇంటెలిజెనస్, ప్రణాళిక, ఫైటర్ జెట్లు, ఆపరేషన్ సరిగ్గా జరిగింది.’’ అని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయిల్ ఎయిర్‌ఫోర్స్ 69వ స్క్వాడ్రన్ కమాండర్ విలేకరులతో చెప్పారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూనే ఈ దాడులకు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనుమతులు ఇచ్చారు.