Nepal: నేపాల్‌లో ప్రజాస్వామ్యం అనే ప్రయోగం విఫలమైంది. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు నేపాల్ ను పాలించాయంటే, అక్కడి అస్థిరత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ‘‘రాచరికం’’ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. చివరకు అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది. ఇవే తాజాగా, హిమాలయ దేశంలో జరుగుతున్న హింసాత్మక ఆందోళనకు కారణమయ్యాయి. సోషల్ మీడియా బ్యాన్ అనేది ఇందుకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. 2008లో నేపాల్‌ను 240 ఏళ్లు పాలించిన షా రాజవంశం రద్దు చేయబడింది. రెండేళ్ల నిరసన తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడింది.
ఇప్పుడు, మళ్లీ నేపాల్‌లో రాచరికం పునరుద్ధరించబడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి 1559లో ద్రవ్య షా అనే రాజ్‌పుత్ వంశానికి చెందిన వ్యక్తి గూర్ఖా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రమంగా ఇది నేపాల్ మొత్తాన్ని పాలించడం మొదలుపెట్టారు. 1743లో పృథ్వీ నారాయణ షా దేశంలో ఐక్యత తీసుకువచ్చారు. చిన్నచిన్న సంస్థానాలు అంతా ఒకే రాజ్యంగా మారి, ఆధునిక నేపాల్ గా ఆవిర్భవించింది. 19వ శతాబ్ధంలో బ్రిటీష్ వారి ఒత్తిడి, అంతపురం కుట్రలు, ఎన్నో పోరాటాలు వచ్చిన షాల రాచరికం చెక్కుచెదరలేదు.
Read Also: Supreme Court: ‘‘ మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..
హత్యాకాండతో మొదలైన పతనం:
2001లో నారాయణహితి ప్యాలెస్‌లో రాజ హత్యాకాండ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్యలతో పాటు రాజకుటుంబంలోని చాలా మందిని యువరాజు దీపేంద్ర హతమార్చాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తరువాత పరిణామాల్లో రాజుగా జ్ఞానేంద్ర షా ప్రకటించబడ్డాడు. 76 ఏళ్ల ఈయన నేపాల్‌కి చివరి రాజు. ఆ తర్వాత నేపాల్ అంతర్యుద్ధంతో అట్టుడికింది. మావోయిస్టు తిరుగుబాటుతో రాచరికం అంతమైంది. 2005లో రాజు జ్ఞానేంద్ర పార్లమెంట్‌ని రద్దు చేసి, అత్యవసర పరిస్థితిని విధించారు. దీంతో తిరుగుబాటు తీవ్రమైంది. ఏప్రిల్ 2008లో రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మే 28,2008లో నేపాల్ అధికారికంగా ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా మారింది. 239 ఏళ్ల షా రాజ పాలకుల పాలన ముగిసిపోయింది.