Maldives: ద్వీపదేశం మాల్దీవుల్లో క్రమంగా ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతోంది. ఇటీవల పలు పరిణామాలు ఆ దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని సూచిస్తున్నాయి. భారత్ అంటే తీవ్ర వ్యతిరేకతతో పాటు ఇజ్రాయిల్‌పై ఆ దేశం ఆగ్రహంతో ఉంది. గాజా యుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది.. మాల్దీవుల పార్లమెంట్ ఇటీవల పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఇజ్రాయిల్ పాస్‌పోర్టులు ఉన్న వారిని రాకను, ఇజ్రాయిల్ తయారు చేసిన వస్తువుల దిగుమతిని నిషేధిస్తుంది.
మరోవైపు, సోమవారం రాజధాని మాలేకి 7 కి.మీ దూరంలో ఉన్న హుల్‌హుమలేలోని సెంట్రల్ పార్క్ సమీపంలో మాల్దీవుల్లోని స్థానిక ప్రజలు, ఇద్దరు భారతీయులకు మధ్య జరిగిన వాగ్వాదం దాడిగా మారింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Crying Benefits: నవ్వడం వల్ల మాత్రమే కాదు.. ఏడిస్తే కూడా ఎన్నో లాభాలు!
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇజ్రాయిల్ మహిళా టూరిస్టుపై స్థానిక ప్రజలు వేధించారు. ఏప్రిల్ 30న ఓ ద్వీపం నుంచి ఆమెను తరిమికొట్టారు. దీనిని ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు మహ్మద్ జాకీ గర్వంగా షేర్ చేశాడు. ‘‘ఇజ్రాయిల్ దేశం మారణహోమం చేస్తున్న సమయంలో ఆ దేశానికి చెందిన ఓ టూరిస్టు ద్వీపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఆమెను స్థానికులు తన్నితరిమేశారు. ఆమె ప్రస్తుతం ఎయిర్ పోర్టు వెళ్లే మార్గంలో ఉంది. మానవత్వం ఇకపై వారిని స్వాగతించదు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఆ దేశంలో ఇటీవల తీవ్రవాదం పెరుగుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కాకుండా పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబాలు మాల్దీవుల్లో తిష్టవేశాయి. 2014-18న మధ్య ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాడేందుకు 5 లక్షల మంది ఉన్న మాల్దీవుల నుంచి 250 మంది పోరాడటానికి వెళ్లారు. ఇందులో చాలా మంది చనిపోయారు. నివేదికల ప్రకారం 2004 సునామీ తర్వాత మాల్దీవుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరిగింది.