Site icon NTV Telugu

Bangladesh: ‘‘అతడి రక్తం వృధా కాదు’’.. హాది అంత్యక్రియల్లో భారత వ్యతిరేక నినాదాలు..

Sharif Osman Hadi Funeral

Sharif Osman Hadi Funeral

Bangladesh: బంగ్లాదేశ్‌లో రాడికల్ మతోన్మాద విద్యా్ర్థి నాయకుడు షరీప్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హింస చెలరేగింది. డిసెంబర్ 12న ఢాకాలో అతడిని ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చి, తీవ్రంగా గాయపరిచారు. డిసెంబర్ 19న హాది చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఇతడి మరణం తర్వాత బంగ్లాదేశ్ భగ్గుమంది. రాడికల్ శక్తులు మళ్లీ అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మైమన్‌సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణతో హత్య చేశారు.

Read Also: Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?

ఇదిలా ఉంటే, శనివారం హాది అంత్యక్రియలు జరిగాయి. ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది జనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు గుంపులుగా మణిక్ మియా అవెన్యూ వైపు చేరుకున్నారు. పార్లమెంట్ సముదాయం ఉన్న ఈ ప్రాంతం అంతా జనాలతో నిండిపోయింది. జాతీయ సంసద్ భవన్ సౌత్ ప్లాజాలో జరిగిన అంత్యక్రియల కోసం అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బాడీ కెమెరాలతో కూడిన పోలీసు అధికారులు ఢాకా అంతటా మోహరించారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాదిని ఖననం చేశారు.

ఇదిలా ఉంటే, అంత్యక్రియల్లో పాల్గొన్న జనాలు భారత వ్యతిరేక నినాదాలు చేయడం గమనార్హం. గుంపులో చాలా మంది ‘‘ఢిల్లీనా లేక ఢాకానా- ఢాకా, ఢాకా’’ అంటూ నినాదాలు చేయడం వినిపించింది. ‘‘మా సోదరుడు హాది రక్తాన్ని వృధా కానివ్వం’’ అని నినాదాలు చేశారు. హాదీ, గతేడాది షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన సంఘటనలో కీలకంగా వ్యవహరించాడు. హాది హత్య తర్వాత నిందితులు భారత్ పారిపోయి ఉండొచ్చని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version