పాకిస్తాన్ లో మైనారిటీల అణచివేత కొనసాగుతూనే ఉంది. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు, హిందూ అమ్మాయిలను అపహరించుకుని వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం, అత్యాచారాలకు పాల్పడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో అక్కడ మైనారిటీ హిందువులకు చెందిన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. గతేడాది అక్టోబర్ నెలలో కొత్రిలోని సింధు నది ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
తాజాగా బుధవారం రోజు పాక్ లో మరో ఘటన నమోదు అయింది. పాక్ వాణిజ్య రాజధాని కరాచీలోని హిందూ దేవాలయంపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. కరాచీలోని కోరంగి ప్రాంతంలో ఉన్న శ్రీమారి మాతా మందిలోని దేవతా విగ్రహాలపై దాడి జరిగింది. కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘జే’ ప్రాంతంలో ఈ గుడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న హిందువులను భయాందోళనకు గురిచేశాయి. కోరంగి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఆరు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వచ్చి ఆలయంపై దాడి చేశారని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. కరాచీలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం మా దృష్టికి వచ్చిందని.. ఇది మతపరమైన మైనారిటీలను వ్యవస్థాగతంగా హింసించ చర్యగా అభివర్ణించింది. పాకిస్తాన్ కు భారత్ నిరసన తెలియజేసిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. మైనారిటీల భద్రత, శ్రేయస్సుకు చర్యలు తీసుకోవాలని పాక్ కు సూచించింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భారత్, పాక్ ప్రభుత్వానికి నిరసనలు తెలియజేసింది.