Chinmoy Krishna Das: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్‌కి బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇస్కాన్ మాజీ నాయాకుడు, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సతానత జాగ్రన్ జోట్ ప్రతినిధి అయిన దాస్‌ని నవంబర్ 25న ఢాకా ఎయిర్ పోర్టులో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే కారణంగా అతడిపై దేశద్రోహ కేసు నమోదు చేశారు. తాజాగా, ఆయనకు జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్, జస్టిస్ ఎండీ అలీ రెజాలతో కూడిన ధర్మాసనం బెయిల్‌ని మంజూరు చేసింది.
గతేడాది ఆగస్టులో విద్యార్థుల హింసాత్మక ఉద్యమం తర్వాత షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత, బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, బంగ్లా వ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు టార్గెట్‌గా దారుణమైన హింస చెలరేగింది. హిందువుల ఇళ్లు, ఆస్తులు, వ్యాపారాలు, గుడులను మతోన్మాదులు టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు.
Read Also: Hafiz Saeed: మోస్ట్ వాంటెడ్ హఫీస్ సయీద్‌కి పాక్ భారీ భద్రత.. లాహోర్‌లో నిర్భయంగా..
ఆ సమయంలో ఈ హింసకు వ్యతిరేకంగా చిన్మోయ్ కృష్ణ దాస్ మైనారిటీల హక్కుల కోసం నినదించారు. ఈ నేపథ్యంలో అతడిని సైలెంట్ చేసేందుకు యూనస్ సర్కార్ దేశద్రోహ కేసు పెట్టింది. పలు సందర్భాల్లో అతడి బెయిల్‌ని కింది కోర్టులు తోసిపుచ్చుతూ వచ్చాయి. అతడి తరుపున వాదించడానికి కూడా లాయర్ రాని పరిస్థితి నెలకొంది. ముస్లిం బార్ అసోసియేషన్ అతడి తరుపున వాదించవద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది. నవంబర్ 27న చట్టోగ్రామ్(చిట్టగాంగ్) కోర్టు వెలుపల దాస్ అనుచరులు, అధికారులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందులో ఒక న్యాయవాది మరణించారు. అతడి అరెస్ట్‌పై భారత్ కూగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణమైంది.