Pakistan: పాకిస్తాన్‌లో హిందూ మంత్రి ఖీల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. సింధ్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వం చేపడుతున్న కాలువ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అతడిపై దాడి చేశారు. ఈ ప్రాజెక్టు నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా సింధ్ ప్రాంతంపై ప్రభావం పడుతుందని అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, సింధ్ ప్రావిన్సు గుండా ప్రయాణిస్తున్న సమయంలో కోహిస్తానీపై దాడి జరిగింది.
ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని శిక్షిస్తామని చెప్పారు. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ఇటీవల ఓ భారీ కాలువ నిర్మాణాన్ని ప్రారంభించింది. దీని వల్ల దిగువ ప్రాంతమైన సింధ్‌కి రావాల్సిన నీటిని పంజాబ్ ప్రాంతానికి మళ్లిస్తున్నారని అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పీఎం షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో మత వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న కోహిస్తానీపై దాడి జరిగింది. ఆయన శనివారం సింధ్ ప్రావిన్స్ తట్టా జిల్లా గుండా వెళ్తున్నప్పుడు టమోటోలు, బంగాళాదుంపలతో నిరసనకారులు దాడి చేశారు. ఈ దాడిలో కోహిస్తానీ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: UP News: భార్యపై మిస్సింగ్ ఫిర్యాదు.. కట్ చేస్తే, లవర్‌తో తాజ్‌మహల్ వద్ద ఎంజాయ్..
కోహిస్తానీ అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)లో కీలక నేత. ఈ దాడిపై సింధ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పోలీస్ (ఐజీపీ) గులాం నబీ మెమన్ నుండి సంఘటన వివరాలను ప్రభుత్వం కోరింది. సింధ్ సీఎం సయ్యద్ మురాద్ అలీ షా కూడా ఈ దాడిని ఖండించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదని అన్నారు. దాడిలో పాల్గొన్న దుండగులను వెంటనే అరెస్ట్ చేసి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ ప్రాంత డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆయన ఆదేశించారు.
గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కింద పంజాబ్ ప్రావిన్స్‌లో ఆరు కాలువలను నిర్మించే ప్రతిపాదనను పాక్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు పాక్ సైన్యం, ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మద్దతు ఉంది. అయితే, ఈ ప్రాజెక్టు చేపడితే సింధ్ పూర్తిగా ఎడారిగా మారుతుందని, అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.