Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ దాడిలో హతమయ్యాడు. లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంలో, శనివారం కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఏకంగా 80 బంకర్ బస్టర్ బాంబుల్ని ఉపయోగించి నస్రల్లా ఉన్న బంకర్‌ని పేల్చేసింది. నస్రల్లా చనిపోయినట్లు శనివారం ఇజ్రాయిల్ ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత హిజ్బుల్లా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
Read Also: Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. మూల నక్షత్ర సమయంలో సీఎం దర్శనం
ఇదిలా ఉంటే, పేలుడు స్థలం నుంచి నస్రల్లా మృతదేహాన్ని లెబనాన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి మృతదేహం చెక్కు చెదరకుండా ఉందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. పేలుడు నుంచి విడుదలైన శక్తి కారణంగా అతడి శరీరంపై కేవలం మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే ఇతడి మరణానికి కారణమైందని వైద్యులు చెబుతున్నారు. ఇతని అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.