తాలిబన్ల పాలన మాకొద్దు.. అంటూ లక్షలాది మంది కాబుల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ బయట తాలిబన్లు.. లోపల విదేశీ బలగాలు పహారా కాస్తున్నాయ్. రోజులకొద్దీ అక్కడే ఉండటంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళల ఆర్తనాదాలు, పసి పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయ్. కొందరైతే తమ పిల్లలైనా కాపాడాలంటూ పిల్లలను విదేశీ బలగాలకు ఇచ్చేస్తున్నారు.
ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల చెర నుంచి తమ కంటిపాపలను కాపాడుకోవాలనే ఆరాటం. కాబుల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర కొందరు తల్లుల పరిస్థితి ఇది. ఓ వైపు తాలిబన్లు తూటాలతో బెదిరిస్తుంటే.. తమ పిల్లలను కంచె అవతల ఉన్న విదేశీ బలగాలకు ఇచ్చేస్తున్నారు. ఇక కొందరు చిన్నారులు ఆకలితో, ఇంకొందరు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారందరినీ విదేశీ బలగాలు అక్కున చేర్చుకుంటున్నాయి. అనారోగ్యంతో ఉన్న చిన్నారులను తీసుకుని.. వారిని లాలిస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు అందిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ లోపల ఉన్న వైద్య సిబ్బంది.. అనారోగ్యం బారిన పడిన చిన్నారులకు చికిత్స చేస్తున్నారు.