కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారింది కుంభమేళ. నిబంధనలు గాలికి వదిలేయడంతో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయ్. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2,36,751 శాంపిల్స్ పరీక్షించగా..1701మందికి పాజిటివ్‌గా తేలింది. భక్తులతో పాటు సాధువులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. మరోవైపు కరోనా కేసులు పెరిగినా సరే మహాకుంభమేళా వాయిదా వేయడం కుదరని తేల్చి చెప్పింది ఉత్తరాఖండ్ సర్కార్. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కుంభమేళాను నిలిపివేసేందుకు ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. రెండు వారాల ముందుగానే కార్యక్రమాన్ని ముగిస్తారన్న వార్తలు వారు ఖండించారు. వాస్తవానికి కుంభమేళా జనవరిలో ప్రారంభమయ్యేది. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పుణ్య స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు.. పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.