Israel-Hamas War: ఇజ్రాయిల్ పై దాడి చేసి చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని హతమార్చింది హమాస్ ఉగ్రవాద సంస్థ. హమాస్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఇదిలా ఉంటే హమాస్ జరిపిన అనాగరిక హత్యల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. హమాస్, ఐసిస్ కన్నా హీనంగా ఉందని విమర్శించారు. ఒక జాతిని నిర్మూలించాలనుకున్న ఉగ్రవాదులే ఇలాంటి భయానక ఘటనలకు పాల్పడుతారని అన్నారు.
Read Also: Israel: బందీలను రక్షించడానికి రెస్కూ ఆపరేషన్.. సిద్దమవుతున్న ప్రత్యేక దళం “సయెరెట్ మత్కల్ “
ఇదిలా ఉంటే గాజా డివిజన్ ప్రాంతాన్ని క్లోజ్డ్ మిలిటరీ జోన్ గా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోకి జనాలు రావద్దని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం హమాస్ ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హమాస్ సభ్యులు, దానికి సంబంధించిన నాయకులు ఉన్నారని తెలిసిన ఏ ప్రాంతంలోనైనా, పరిమితులు ఉన్నప్పటికీ.. మేము ఖచ్చితంగా దాడులు చేస్తామని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బీర్షెబా తెలిపారు.
రోజులు గడిచే కొద్ది ఇజ్రాయిల్-హమాస్ పోరు తీవ్రమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ పై ఇటు హమాస్ దాడులు చేస్తుంటే, మరోవైపు నుంచి లెబనాన్, సిరియా దేశాల నుంచి ఉగ్రమూకలు ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నాయి. దీంతో మూడు వైపుల ఇజ్రాయిల్ యుద్ధంలో మునిగిఉంది. ఇప్పటికే గాజా స్ట్రిప్ ను ఇజ్రాయిల్ దిగ్భంధించింది. విద్యుత్, నీరు, ఇంధనం, ఆహారం అన్నింటిని కట్ చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ తెలిపారు.