Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇన్నాళ్లు ప్రత్యర్థి గ్రూపులుగా ఉన్న హమాస్, పాలస్తీనాలోని ఇతర గ్రూపులు చేతులు కలిపాయి. పాలస్తీనా కోసం ‘జాతీయ ఐక్యత’ కోసం పాలస్తీనాలోని ప్రత్యర్థులతో హమాస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హమాస్, ఫతాతో సహా 12 ఇతర పాలస్తీనియన్ గ్రూపులకు చెందిన ప్రతినిధులతో బీజింగ్ వేదికగా ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. సీనియర్ హమాస్ అధికారి ముసా అబు మర్జుక్, ఫతా దూత మహమూద్ అల్-అలౌల్, ఇతర ప్రతినిధులకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆతిథ్యం ఇచ్చారు. యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనాను పాలించే ఒప్పందంగా చైనా దీనిని అభివర్ణించింది.
Read Also: Mallikarjun Kharge: కుర్చీని కాపాడిన రెండు రాష్ట్రాలకే మేలు.. ఖర్గె సంచనల వ్యాఖ్యలు
ఇజ్రాయిల్, హమాస్ పోరు ప్రారంభమైన 9 నెలల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అక్టోబర్ 07న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చింది. 251 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెల్లింది. వీరిలో ఇప్పటికీ 116 మంది గాజాలోనే ఉన్నారు. ఈ దాడి తర్వాత గాజాతో పాటు ఇతర పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు ఆపరేషన్ జరుపుతామని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. గాజాపై జరిగిన దాడిలో ఇప్పటి వరకు 39,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ పోరాటం గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభానికి కారణమైంది.
పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్‌ని హమాస్ పాలిస్తుండగా, వెస్ట్ బ్యాంక్‌ని ఫతా పాలిస్తోంది. ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. దీంతో పాలస్తీనా వివాదం మరింత సంక్లిష్టంగా మారింది. ఈ వివాదంతో చైనా మధ్యవర్తిత్వం వహించింది. మంగళవారం బీజింగ్‌లో ప్రకటించిన ఒప్పందం కొనసాగుతోందా లేదా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, పాలస్తీనా ప్రత్యర్థుల మధ్య సయోధ్యను రూపొందించడంలో చైనా విజయవంతమైంది. ‘‘బీజింగ్ డిక్లరేషన్’’ అని పిలువబడుతున్న ఈ ఒప్పందంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాదడుతూ.. యుద్ధానంతరం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒప్పందమని అన్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో జిప్ట్, అల్జీరియా మరియు రష్యాకు చెందిన రాయబారులు కూడా ఉన్నారు.