Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న గ్వాదర్ పోర్టులో కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పాక్ స్థానిక మీడియా బుధవారం నివేదించింది. భద్రతా సిబ్బంది ప్రతిదాడుల్లో ఇద్దరు దుండగులు మరణించినట్లు తెలుస్తోంది. గ్వాదర్ పోర్టు అరేబియా సముద్రంలో హర్మూజ్ జలసంధికి సమీపంలో నిర్మితమవుతోంది. పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఈ పోర్టును నిర్మిస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు రవాణాకు ఈ మార్గం కీలకంగా ఉంది. అయతే, ఈ కాల్పుల గురించి గ్వాదర్ డిప్యూటీ కమిషనర్, పోలీసులు ఇంతవరకు స్పందించలేదు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో కుప్పకూలిన బొగ్గు గని.. 12 మంది దుర్మరణం..
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)కి ఈ గ్వాదర్ పోర్టు చాలా కీలకం. సీపెక్ ప్రాజెక్టులో భాగంగా చైనా పాకిస్తాన్ వ్యాప్తంగా రోడ్లు, ఇంధన ప్రాజెక్టులను నిర్మిస్తోంది. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ కలల ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిర్మితమవుతున్నాయి.
అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తరుచుగా ఈ ప్రాంతంలో దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వ అకృత్యాలకు ఎదురుతిరిగి పోరాడుతోంది. పాక్ నుంచి విడిపోయేందుకు ఈ గ్రూపు మిలిటెంట్ పోరాటం చేస్తోంది. గ్వాదర్ ప్రాంతంలో చైనా వర్కర్స్, పాక్ సైన్యం, పోలీసులు టార్గెట్‌గా కాల్పులు జరుపుతోంది.