Gotabaya Rajapaksa Returns To Srilanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స స్వదేశానికి తిరిగి వచ్చారు. దాదాపుగా 50 రోజులకు పైగా ప్రవాసంలో గడిపిన ఆయన స్వదేశం శ్రీలంకలో అడుగుపెట్టారు. రాజపక్స శుక్రవారం అర్థరాత్రి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. రాజపక్స పార్టీ మద్దతుదారులు, నాయకులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. భారీ సైనిక కాన్వాయ్ భద్రతలో కొలంబోలోని అతనికి కేటాయించిన ఇంటికి వెళ్లారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో జూలై నెలలో ప్రజలు పెద్ద ఎత్తన రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళనలు చేశారు. కొలంబోలోని ప్రెసిడెంట్ భవనాన్ని ముట్టడించారు. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంక నుంచి జూలై 13న తన భార్య, బాడీగార్డులతో కలిసి మాల్దీవులకు పారిపోయాడు. అక్కడ నుంచి సింగపూర్, ఆ తరువాత థాయ్ లాండ్ దేశాల్లో ఆశ్రయం పొందాడు. సింగపూర్ వెళ్లిన తర్వాత తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘేను ఎన్నుకున్నారు.
Read Also: The Kashmir Files : భారతదేశ మూలాల కథలతో ‘కాశ్మీర్ ఫైల్స్’ బృందం
అయితే ప్రస్తుతం గోటబయ రాజపక్సపై ఎలాంటి కోర్టు కేసు, అరెస్ట్ వారెంట్ పెండింగ్ లో లేదు. అయితే గతంలో మహిందా రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా గోటబయ ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే గోటబయ రాజపక్స అధ్యక్షుడు అయిన తర్వాత.. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఈ కేసుల నుంచి మినహాయింపు పొందాడు.
అయితే స్వదేశానికి తిరిగి వచ్చిన గోటబయ రాజపక్సకు శ్రీలంక ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. అయితే గోటబయ మళ్లీ స్వదేశానికి రావడంతో ప్రజల నిరసన, ఆందోళన కార్యక్రమాలు ప్రారంభం అవుతాయో లేదో చూడాలి. అయితే రణిల్ విక్రమ సింఘే అధ్యక్షుడు అయిన తర్వాత నిరసనకారులపై కేసులు నమోదు చేశారు. కొలంబోలో నిరసన తెలపడానికి వేసుకున్న టెంట్లను కూల్చేశాడు. ఇక అక్కడ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.