తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కుటుంబంతో సహా దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. మాల్దీవుల్లోనూ గొటబాయ రాజపక్సకు నిరసన సెగ తగిలింది. పదుల సంఖ్యలో శ్రీలంక పౌరులు నిరసన తెలిపారు. గొటబాయకు మాలే సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. శ్రీలంక ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలిపాలని అక్కడి ప్రజలను కోరారు.
శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ‘ ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్‌కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి’ అని బ్యానర్ ప్రదర్శించారు. మిలిటరీ విమానంలో మాలేలోని వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేలో దిగిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సింగపూర్ వెళ్లనున్నారని సమాచారం. ఈ ఉదయం మాల్దీవులకు బయల్దేరిన రాజపక్సే బుధవారం తర్వాత సింగపూర్‌కు వెళ్లనున్నట్లు మాల్దీవుల వర్గాలు డైలీ మిర్రర్‌కి తెలిపాయి. గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ వ్యతిరేకించింది. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు.
Srilanka Crisis: శ్రీలంకకు వెళ్లాల్సిన 120కి పైగా విమానాలు కేరళలో ల్యాండింగ్
మరోవైపు లంకలో ఇవాళ టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో ఈసారి ప్రధాని కార్యాలయం మీద ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే శ్రీలంక పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైతే కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు.