భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది.
కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీ 7 దేశాలు భారత నిర్ణయాన్ని ఖండించాయి. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు. ప్రతి ఒక్కరు ఎగుమతులపై పరిమితులు విధించడం… మార్కెట్లను మూసివేయడం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జీ20లో సభ్యుడిగా ఉన్న భారత్ తన బాధ్యతలను నిర్వహించాలని కోరుతున్నామని ఓజ్డెమిర్ అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆహార సరఫరా అంతరాయానికి రష్యా కారణం అంటూ జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఆహార కొరతకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద గోధుమల ఉత్పత్తిదారుగా భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో గోధుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇండియా తరువాత రష్యా, ఉక్రెయిన్ లోనే గోధుమలు ఎక్కువగా పండుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో గ్లోబల్ సప్లై చైన్ కు విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్లే ఇటీవల ఇరాన్ నిత్యావసరాల ధరలను ఏకంగా 300 శాతం పెంచాయి.