Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్ ప్రాంతంలోని రేర్ ఎర్త్ మినరల్స్, రాగి వంటి లోహాలను అమెరికా కొల్లగొట్టడానికి చూస్తోంది. దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా సహకరిస్తోంది.
‘‘పస్నీ’’తో చైనాకు వెన్నుపోటు:
పాకిస్తాన్ ద్వారా అరేబియా సముద్రానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని 60 బిలియన్ డాలర్లతో చైనా ‘‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)’’ను ప్రారంభించింది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్టును నిర్మించింది. అయితే, ఇప్పుడు ఈ గ్వాదర్ పోర్టుకు కేవలం 70 మైళ్ల దూరంలో అమెరికాతో కలిసి ‘‘పస్నీ’’ ఓడరేవును నిర్మించేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఇది భారత్ ఇరాన్‌లో నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు కేవలం 178 మైళ్ల దూరంలోనే ఉంది.
చైనా, భారత్, ఇరాన్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు కీలమైన ఈ వ్యూహాత్మక స్థానాన్ని పాకిస్తాన్ అమెరికాకు స్థానం కల్పిస్తోంది. ఈ ఓడరేవు అరేబియా, హిందూ మహాసముద్రంలోని సముద్ర భద్రతకు కూడా చిక్కులు కల్పిస్తుంది. ఈ పస్నీ ఓడరేవు ద్వారా బలూచిస్తాన్‌లోని ఖనిజ సంపదను అమెరికాకు తరలించవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. అయితే, ఇప్పటి వరకు దీనిపై రెండు దేశాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ కార్యరూపం దాల్చితే, చైనాతో పాటు భారత్ ప్రయోజనాలకు కూడా తీవ్ర భంగం కలిగించవచ్చు. దీని నిర్మాణానికి 1.2 బలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఓడరేవు బ్యాటరీ టెక్నాలజీ, క్షిపణుల తయారీ, అధునాతన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ఉపయోగించే రాగి, యాంటిమోనీ, నియోడైమియం వంటి ఖనిజాల ఎగుమతులకు గేట్-వేగా మారుతుంది. సెప్టెంబర్ 8, 2025న, పాకిస్తాన్ మిలిటరీ ఇంజనీరింగ్ కార్ప్స్‌తో $500 మిలియన్ల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్ ఈ ఖనిజాల షిప్‌మెంట్‌ను మిస్సోరీకి చెందిన US స్ట్రాటజిక్ మెటల్స్ (USSM)కి ఎగుమతి చేసింది.
భారత్‌కు ఇబ్బందులే:
అమెరికా, పాకిస్తాన్ స్నేహం భారత్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా మద్దతుతో పాక్ బలుపు మాటలు మాట్లాడుతోంది. ఇక పస్నీ ద్వారా భారత వ్యూహాత్మక ఓడరేవు చాబహార్‌ని కౌంటర్ చేయవచ్చు. అమెరికా స్నేహం పాకిస్తాన్‌కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ వంటి వ్యూహాత్మక సహకారాన్ని అందించవచ్చు. ఈ చర్యల ద్వారా పాకిస్తాన్తన రక్షణ ఒప్పందాలను మెరుగుపరుచుకోవచ్చు. పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ విశ్వాసాన్ని పెంచుతుంది. భారత్‌తో పోలిస్తే తన స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఈ చర్యలు ఇరాన్‌కు కూడా ప్రమాదకరమై. ఇరాన్ షిప్పింగ్ లైన్లపై అమెరికా నిఘా పెరుగుతుంది.
