Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. హమాస్‌ని సమూలంగా నాశనం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. హమాస్ ఇజ్రాయిల్‌పై జరిపిన దాడుల్లో 1400 మంది చనిపోయారు, ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ గాజాపై దాడి చేస్తోంది. ఈ దాడుల వల్ల సామాన్య పాలస్తీనియన్లు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఇప్పటికే 11000 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు.
Read Also: Uniform civil code: యూసీసీ బిల్లుకు సిద్ధమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం..
ఇదిలా ఉంటే గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఇజ్రాయిల్‌కి పిలుపునిచ్చారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బాంబు దాడుల వల్ల ఏ ప్రయోజనం లేదని, కాల్పుల విరమణ పాటించాలని, ఇది ఇజ్రాయిల్‌కి ప్రయోజనంగా ఉంటుందని అన్నారు. హమాస్ ఉగ్రవాద దాడిని ఫ్రాన్స్ స్పష్టంగా ఖండిస్తోందని, ఇజ్రాయిల్‌కి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని చెబుతూనే.. బాంబు దాడులు ఆపాలని మక్రాన్ ఇజ్రాయిల్‌ని కోరారు. కాల్పుల విరమణ కోసం యూఎస్, బ్రిటన్ కూడా తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే మక్రాన్ వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ తీవ్రంగా స్పందించింది. ప్రపంచదేశాలు ఇజ్రాయిల్‌ని కాదు.. హమాస్ చర్యల్ని ఖండించాలని, హమాస్ మా దగ్గర పాల్పడుతున్న నేరాలు రేపు పారిస్, న్యూయార్క్‌లోనూ జరగొచ్చని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అన్నారు. పారిస్ వేదికగా జరిగిన గాజా మానవతా సదస్సులో మక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాంబు దాడుల వల్ల పిల్లలు, మహిళలు, వృద్దులు చంపబడుతున్నారని, అందుకే ఇజ్రాయిల్‌ని కాల్పుల విరమణ పాటించాలని కోరతున్నట్లు ఆయన అన్నారు.