Earthquake In Turkey And Syria: సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటిదాకా 100 మందికి పైగా మృతి చెందినట్టు తేలింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 4:17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం సంభవించిన కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 6.7 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి
అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ప్రకృతి విలయంలో ఇప్పటిదాకా టర్కీలో 53 మంది, సిరియాలో 42 మంది మృతి చెందినట్టు తేలింది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు కాబట్టి.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. టర్కీలో మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉండగా.. సిరియాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు వెంటనే చేరుకొని, సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు.. ఈ భారీ భూకంపం దెబ్బకు ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఇళ్లల్లోకి వెళ్లొద్దని సూచించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అలాగే.. సహాయక చర్యలు చేపట్టాలని, బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారుల్ని ఆదేశించింది.
American Airlines: దారుణం.. సాయం కోరిన పాపానికి సిబ్బంది పైశాచికం
ఇదిలావుండగా.. టర్కీలో భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. 2020లో జనవరి నెలలో ఇలాజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. అంతకుముందు 1999లో అయితే.. టర్కీ చరిత్రలోనే అత్యంత భీకర ప్రకృతి విలయాన్ని చవిచూసింది. ఆ ఏడాది 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో 17 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.