Earthquake Hits Iran: ఇరాన్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. వాయువ్య ఇరాన్ లోని పశ్చిమ అజార్ బైజార్ ప్రావిన్సులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 528 మంది గాయపడ్డారు. 135 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. భూకంపం ధాటికి 12 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు.
తెల్లవారుజామున 3.30 గంటలకు భూకంపం రావడంతో చాలా వరకు ఇళ్లు దెబ్బతిన్నాయని ఇరాన్ జాతీయ టెలివిజన్ వివరాలు వెల్లడించింది. భూకంప కేంద్రానికి దగ్గరలో ఉన్న సల్మాస్, ఖోయ్ నగరాలకు సమీపంలోని అన్ని ప్రధాన పట్టణాలకు, గ్రామాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఇరాన్ దేశంలో 1990లో చివరిసారిగా ఘోరమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 40,000 మంది మరణించారు. 3 లక్షలమంది గాయపడ్డారు. 60 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. 2003లో ఆగ్నేయ ఇరాన్ లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల పురాతన బామ్ నగరం ధ్వంసం అయింది. ఈ భూకంపం వల్ల 31,000 మంది మరణించారు.
Read Also: Mohan Bhagwat: “మత ఆధారిత” జనాభా అసమతుల్యతను విస్మరించొద్దు.
ఇరాన్, ఆప్ఘనిస్తాన్ ప్రాంతంలో భూమి అడుగున టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు తరుచుగా సంభవిస్తుంటాయి. ముఖ్యంగా ఇరాన్, ఆప్ఘనిస్తాన్ ప్రాంతంలో హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఏడాది ఆప్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం వల్ల వేల మంది మరణించారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాయువ్య ప్రాంతాలు ఎక్కువగా భూకంపాలకు గురవుతుంటాయి.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఇండోనేషియా, జపాన్, తైవాన్ ప్రాంతాల్లో కూడా భారీ భూకంపాలు సంభవించాయి. పసిఫిక్ సముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ప్రాంతంలో కూడా సముద్రం అడుగులో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తున్నాయి.