Earthquake hits Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. వరసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం ఉత్తరాన అచే ప్రావిన్స్ లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణా నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఇచ్చిన భూకంపంతో ప్రజలు ఇళ్ల నుంచి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. సునామీ వార్తల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read Also: Kerala Lottery winner is in Trouble: కేరళ లాటరీ విజేతకు కొత్త కష్టాలు
2004లో అచే ప్రావిన్స్ లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ భూకంపం ధాటికి ఇండోనేషియాతో పాటు ఇండియా, శ్రీలంకతో పాటు 12 దేశాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. దాదాపుగా 2,30,000 మంది చనిపోయారు. తాజాగా శనివారం 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమికి 49 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం భూకంప తీవ్రతను 6.4గా అంచనా వేసింది.
ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్స్ లో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 25 మంది మరణించగా.. 460 మంది గాయపడ్డారు. జనవరి 2021లో, పశ్చిమ సులవేసి ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 100 మందికి పైగా మరణించాగా.. దాదాపు 6,500 మంది గాయపడ్డారు. ఇండోనేషియా ప్రాంతం ఎప్పుడూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, సునామీల వంటి విపత్తులను ఎదుర్కొంటోంది. భూకంపాల వల్ల 27 కోట్ల జనాభా కలిగిన ఇండోనేషియా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉండటంతో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.