Kamala Harris: వెనిజులాపై అమెరికా దాడి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యని బంధించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇజ్రాయిల్, అర్జెంటీనా వంటి కొన్ని దేశాలు ట్రంప్ చర్యల్ని సమర్థించగా.. చైనా, ఇరాన్, రష్యా వంటి దేశాలు యూఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇదిలా ఉంటే, సొంత దేశంలోని ప్రతిపక్షం నుంచి కూడా ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. డెమెక్రాట్ నేత కమలా హారిస్‌తో పాటు న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ ట్రంప్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.
Read Also: Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి.. పాముతో పోలీసులను భయపెట్టిన ఆటో డ్రైవర్
మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా స్పందించారు. ఈ చర్య ప్రజాస్వామ్యం లేదా డ్రగ్స్ నియంత్రణ కోసం కాదని, పూర్తిగా చమురు కోసమని ఆమె ట్రంప్‌పై ఆరోపణలు గుప్పించారు. చమురు కోసమే, ట్రంప్ రాజకీయ ఆశయాల కోసమే ఇది జరిగిందని ఆరోపించారు. ఈ చర్యల వల్ల అమెరికా సురక్షితంగా మారదని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బలవంతంగా ప్రభుత్వాన్ని మార్చడం ప్రాంతీయ అస్థిరతకు కారణమై, చివరకు అమెరికన్ల ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఆమె హెచ్చరించారు. మదురో ఒక క్రూరమైన నియంత అయినా సరే, ఈ చర్య చట్టవిరుద్ధమని అన్నారు. ప్రభుత్వ మార్పు లేదా చమురు పేరుతో ప్రారంభమైన యుద్ధాలు గందరగోళంగా మారి, చివరకు అమెరికన్ కుటుంబాలే బలవుతున్నాయని అన్నారు.
అమెరికన్ ప్రజలు ఈ చర్యల్ని కొరుకోవడం లేదని, ట్రంప్ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆపరేషన్‌కు సరైన చట్టబద్ధత, స్పష్టమైన ఎగ్జిట్ ప్లాన్ లేదని, దీని వల్ల అమెరికన్ సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతాయని ఆమె అన్నారు. బిలియన్ డాలర్లు ఖర్చు చేసి, ఒక ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల అమెరికాకు ఏం లాభమో ట్రంప్ చేప్పలేకపోతున్నారని అన్నారు. మరోవైపు, న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా ట్రంప్‌పై విమర్శలు చేశారు. ఒక స్వతంత్ర దేశంపై దాడి చేయడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.