చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా చైనాలో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు అనేక నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా కరోనా ఆంక్షలు, నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా చైనాలో 40కోట్ల మంది ప్రజలు ఆంక్షల గుప్పిట్లో ఉన్నారు. కరోనా విజృంభణతో చైనాలోని ప్రధాన నగరాలు వణికిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో షేన్‌ఝేన్‌లో మొదట కొవిడ్ ఆంక్షలు మొదలుపెట్టారు. ఇప్పుడు షాంఘై వరకు ఆంక్షలు విస్తరించాయి. చైనాలోని 100 ప్రధాన నగరాల్లో దాదాపు 87 చోట్ల ఆంక్షలు అమలవుతున్నాయి. రెండున్నర కోట్ల జనాభా ఉన్న షాంఘై సిటీలో గత రెండు వారాలుగా లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ… మహమ్మారి ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు.
Read Also: Hanuman Shobha Yatra: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
షాంఘై పొరుగు ప్రాంతమైన సుఝౌ ప్రావిన్సులోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. కున్‌షాన్ నగరంలో గత వారం లాక్‌డౌన్ విధించారు. మరోవైపు షాన్‌షీ ప్రావిన్సు రాజధాని తైయువాన్‌లోనూ కొవిడ్ కట్టడి చర్యలు కఠినతరం చేస్తున్నారు. ప్రస్తుతం 53లక్షల జనాభా కలిగిన ఆరు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇక ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతితో ప్రముఖ వాణిజ్య నగరమైన గువాన్‌ఝౌలోనూ కొవిడ్ కట్టడి చర్యలు ఊపందుకున్నాయి. పాఠశాలలు మూసివేయడం, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా ఆంక్షల కారణంగా చాలా సంస్థలు తమ ఆపరేషన్స్ నిలిపివేస్తున్నాయి. పెగాట్రాన్ కార్పొరేషన్, టెస్లా, నియో లాంటి సంస్థలు మూతపడుతున్నాయి. కోవిడ్ ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగితే మే నెలలో చైనా ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తిగా షట్ డౌన్ అవుతుందని సంస్థలు అంటున్నాయి. లాన్‌డౌన్, ఇతర కఠిన ఆంక్షలతో ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతోంది. అయితే తాము కోవిడ్ జీరో విధానానికే కట్టుబడి ఉంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.